శృంగవరపుకోట:వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలో వున్న గ్రామీణ ఉప కేంద్రాలకు మహర్దశ పట్టనుంది. సొంత భవనాలు లేని ఉప కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. స్థల సేకరణకు అధికారులకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 257 వైద్య ఆరోగ్య శాఖ గ్రామీణ ఉప కేంద్రాలకు అవసరమైన పక్కా భవనాల నిర్మాణాలకు స్థల సేకరణ జరుగుతోంది. ప్రతి ఉప కేంద్రానికి ఐదు నుంచి పది సెంట్ల భూమి కావాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ రెవెన్యూ అధికారులను కోరింది. ఈమేరకు రెవెన్యూ అధికారులు ఆరోగ్య ఉపకేంద్రాలున్న గ్రామాల్లో స్థల సేకరణ చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో వివాదం లేని ప్రభుత్వ భూములు అందుబాటులో లేవు. వాగుపోరంబోకులు, చెరువు గర్భాలు వంటివి వున్నాయి.
దేశ అత్యున్నత న్యాయ స్థానం సూచనమేరకు ఇలాంటి స్థలాల్లో నిర్మాణాలు చేపట్టడం చట్టవిరుద్దం. దీంతో రెవెన్యూ అధికారులు స్థల సేకరణలో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ భూమి కోసం ఆన్వేషన చేస్తున్నారు. గ్రామీణులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయష్మాన్ భారత్ కార్యక్రమాన్ని రూపొందించింది. దీని ద్వారా క్షేత్ర స్థాయిలో వ్యాధుల బారిన పడుతున్న పల్లె ప్రజలను మెదటి దశలోనే గుర్తించి వారికి వైద్యం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే ప్రభుత్వం ఉప కేంద్రాలకు భవనాలు లేని చోట అన్ని వసతులతో కూడిన పక్కా భవనాలను నిర్మాంచాలన్న ఆలోచన చేసింది. స్థలాలు సేకరించి ఇవ్వాలని గత నవంబర్ నెలలోనే జిల్లా కలెక్టర్‌లకు ఆదేశాలు ఇచ్చింది.
జిల్లాలో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్య సహయం అందించేందుకు 68 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు వున్నాయి. వీటి పరిధిలో 431 గ్రామీణ ఆరోగ్య ఉప కేంద్రాలు పని చేస్తున్నాయి. 5వేల జనాభాలోపు వున్న ఈ ఉప కేంద్రాల్లో ఒకటి నుంచి మూడు గ్రామాల వరకు పరిధి వుంది. 2,500 జనాభాలోపు జనాభాకు ఒక్కరు చోప్పున ఇద్దరు ఎఎన్‌ఎం (ఆరోగ్య కార్యకర్త)లు పని చేస్తున్నారు. ఒకరు రిగ్యూలర్ ప్రాతిపాదికన, మరోకరు కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్ పద్దతిలో సేవలు అందిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడంతో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్దతిలో పని చేసిన కొందరు ఎఎన్‌ఎంలు సచివాలయ ఉద్యోగులుగా మారారు. వీరు సచివాలయ కార్యాలయాల్లో వుండి ఆరోగ్య సేవలు అందించాల్సి వుంటుంది. ఇప్పుడు ఉప కేంద్రాలకు భవనాలను ప్రభుత్వం నిర్మించ నుండడంతో సచివాలయం, ఉపకేంద్ర వున్న గ్రామాల్లో రెండు భవనాలు అందుబాటులోకి రానున్నాయి.