ప్రక్రియను ప్రారంభించిన వైద్యశాఖ
- రూ.576 కోట్ల ఖర్చుతో ప్రతిపాదన
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో దవాఖానలను అప్‌గ్రేడ్‌చేసి వైద్యసేవలను విస్తృతంచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలివిడుతగా తొమ్మిది జిల్లాల పరిధిలోని ఏరియా దవాఖాన, కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లను జిల్లాస్థాయి దవాఖానలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు అనువైన పరిస్థితులు, వసతుల కల్పనపై రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ దృష్టి సారించింది. జిల్లాలవారీగా ప్రభుత్వ దవాఖానాల్లో అధునాతన సౌకర్యాలు కల్పించడంతోపాటు వైద్యసేవలను విస్తరించనున్నారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రం స్థాయి నుంచి సూపర్ స్పెషాలిటీ వైద్యశాలల వరకు రోగ నిర్ధారణకు అవసరమైన పరికరాలతోపాటు ఎంఆర్‌ఐ, సీటీస్కాన్, డిజిటల్ రేడియాలజీ, 2డీ ఎకో, అల్ట్రాసౌండ్, ఆటోఅనలైజర్ వంటి అత్యాధునిక పరికరాలను వివిధ దవాఖానాల్లో ఇప్పటికే అందుబాటులోకి తెచ్చారు. వీటితోపాటు కొత్తగా ఏర్పడిన జిల్లాల పరిధిలోని ఏరియా దవాఖానలను జిల్లా స్థాయి దవాఖానలుగా అప్‌గ్రేడ్‌చేసి ప్రజలకు వైద్యసేవలు అందించడానికి ప్రణాళికాబద్ధంగా చర్యలుచేపట్టారు. అందులో భాగంగానే జోగుళాంబ గద్వాల, మహబూబాబాద్, నారాయణపేట, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నర్సంపేట (వరంగల్ రూరల్), జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, ములుగులోని ఏరియా దవాఖానలను జిల్లాస్థాయి దవాఖానలుగా అప్‌గ్రేడ్‌చేసే ప్రక్రియను ప్రారంభించారు. వీటికోసం రూ.576.78 కోట్ల నిధులకు ప్రతిపాదించగా.. ప్రభుత్వం రూ.214.12 కోట్లను ఇప్పటికే అనుమతించింది. శరీరం కాలి చికిత్సకు దూరప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితిని దృష్టి లో ఉంచుకొని వనపర్తి, నాగర్‌కర్నూల్, గజ్వేల్ దవాఖానల్లో ప్రత్యేకంగా బర్న్ వార్డులను ఏర్పాటు చేసేందుకు రూ.1.50 కోట్లు కేటాయించారు.
వివరాలు సేకరించిన టీవీవీపీ
ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం 9 జిల్లాల పరిధిలో ఏరియా దవాఖానలు/సీహెచ్‌సీలను జిల్లా స్థాయి దవాఖానలుగాఅప్‌గ్రేడ్ చేసేందుకు తెలంగాణ వైద్యవిధాన పరిషత్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అప్‌గ్రేడ్ చేయాల్సిన దవాఖానల్లో ప్రధానంగా ఎంసీహెచ్ సేవలు, ఇతర స్పెషాలిటీ సేవలు.. జనరల్ మెడిసిన్, డెంటల్, కాటరాక్ట్ సర్జరీలు, జనరల్ సర్జరీ, అనస్థీషియా, ఈఎన్టీ, ఆప్తాల్మాలజీ, రేడియాలజీ, పాథాలజీ విభాగాలను అందుబాటులోకి తెచ్చేందుకు అంచనాలు రూపొందించారు. అప్‌గ్రేడ్ చేయాల్సిన దవాఖానల్లో ప్రస్తుత బెడ్ల సామర్థ్యం, ఆరునెలల్లో ఇన్ పేషెంట్ల సంఖ్య, రెండేండ్లలో ఓపీ, ఐపీ వివరాలు సేకరించారు. అంతేకాకుండా నిర్ణయించిన దవాఖాన ద్వారా సమీప ప్రాంతంలో ఎంతమందికి వైద్యసేవలు అందించగలమన్న దానిపై అంచనాలు రూపొందించారు. నిబంధనల మేరకు జిల్లాస్థాయి దవాఖానకు అనువైన స్థలం, భవన సముదాయం వంటివి ప్రస్తుతం అందుబాటులో ఉన్నవి. కొత్తగా నిర్మాణం చేయాల్సిన భవనాలకు అంచనాలను సిద్ధంచేశారు.