సీతంపేట : కొన్ని నెలలుగా బకాయిపడిన వేతనాల్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో జిల్లాలోని ఆశ కార్యకర్తలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం ఎదుట భారీ ధర్నా చేశారు. సోమవారం నేతలు పి.మణి, బి.రామలక్ష్మి, అధ్యక్షురాలు కె.వరలక్ష్మి, ప్రధాన కార్యదర్శి వి.సత్యవతి, కోశాధికారి జి.లక్ష్మి ఆధ్వర్యంలో సుమారు వెయ్యిమంది కార్యకర్తలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జనవరి నెల నుంచి వేతనాలు బకాయిలున్నాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆగస్టు నెలలో కొంతమందికి వేతనాలు చెల్లించి మిగిలిన వారికి చెల్లించలేదని ఆరోపించారు. సెప్టెంబరు నెలనుంచి పూర్తిగా ఇవ్వలేదని చెప్పారు. అనంతరం అక్కడకు వచ్చిన డి.ఎం.హెచ్.ఒ జనవరి నెల నుంచి నెల వారీగా ఏ నెలలో ఎంతమందికి బకాయిలు ఉన్నాయో వివరించారు. సాంకేతిక కారణాల వల్ల చెల్లించడంలో జాప్యం జరిగిందన్నారు. జనవరి మూడు నాటికి అందరికీ బకాయి వేతనాలు చెల్లిస్తామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం జనవరి మూడు నాటికి చెల్లించకుంటే అమరావతి వెళ్లి ముఖ్యమంత్రి నివాసం ముందు ధర్నా చేస్తామని ఆశ కార్యకర్తలు హెచ్చరించారు. డి.ఎం.హెచ్.ఒ హామీతో ధర్నా విరమించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.