సౌదీలో వైద్యుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ విదేశీ ఉపాధి కల్పన సంస్థ ఎండీ కేవై నాయక్‌
సుల్తాన్‌బజార్‌: విదేశాల్లో ఉపాధికి ఈ నెల 30న ఇంటర్వ్యూలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు తెలంగాణ విదేశీ ఉపాధి కల్పన సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కేవై నాయక్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సౌదీఅరేబియా దేశంలోని ప్రముఖ దవాఖానలో పనిచేసేందుకు గైనకాలజీ వైద్యురాలు, ఎండీ ఇంటర్నల్‌ మెడిసిన్‌ వైద్యుల పోస్టులకు ఇంటర్యూలను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. అభ్యర్థులకు 35 ఏండ్లు ఉండాలని, ఎండీ గైనకాలజీ, ఎండీ ఇంటర్నల్‌ మెడిసిన్‌ పూర్తిచేయడంతోపాటు కనీసం మూడేండ్ల అనుభవమున్నవారు అర్హులని చెప్పారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు పూర్తివివరాలతో, పాస్‌పోర్ట్‌, విద్య, అనుభవం ధ్రువీకరణపత్రాలతో 30న విజయనగర్‌కాలనీ, మల్లేపల్లి ఐటీఐ ప్రాంగణంలోని టామ్‌కాం కార్యాలయంలో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరారు. మరింత సమాచారానికి 7997973358/ 9640630420 ఫోన్లలో సంప్రదించాలని కోరారు.