డాక్టర్లకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి హితవు
రాజమహేంద్రవరం: ''భారత వైద్యులపై ప్రపంచదేశాలకు అపార నమ్మకం ఉంది. విదేశాల రోగులు భారతీయ వైద్యులతో చికిత్స చేయించుకోవడానికి పోటీపడుతున్నారు. ఎన్నో వ్యాధులకు చికిత్స కనిపెట్టిన ఘనత భారత వైద్యులది. మీరంతా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి పాటుపడాలి'' అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నూతనంగా నిర్మించిన డెల్టా ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి గురువారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వైద్యంలో రోగి మానసిక సంతృప్తే ప్రధానమంటూ.. వైద్యం కోసం వచ్చిన రోగి చెయ్యి పట్టుకుని వారిలో విశ్వాసాన్ని నింపాలన్నారు. అక్కడే సగం రోగం తగ్గిపోతుందన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతోనే ప్రధాని ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. కేవలం ప్రభుత్వాల వల్లే అభివృద్ధి సాధ్యం కాదంటూ విద్య, వైద్యం, ఇతర రంగాల్లో ప్రభుత్వాలు ప్రైవేటుసంస్థలను ప్రోత్సహించాలని సూచించారు. డెల్టా ఆసుపత్రి లాంటివి చిన్న పట్టణాల్లోనూ రావాలని కోరారు.