పిల్లల ఆరోగ్యం దెబ్బతీస్తున్నారు

పాఠశాలల సమీపంలోనే తినుబండారాల అమ్మకాలు


 ఆహార భద్రత మండలి సర్వేలో వెల్లడైన వాస్తవాలు

మహబూబ్‌నగర్‌:పాఠశాలల వద్ద నాణ్యత లేని తినుబండారాలు పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అక్కడ విక్రయించే వాటిలో చక్కెర, ఉప్పు, అధికంగా కొవ్వుశాతం ఉండటంతో పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఎత్తుకు తగ్గ బరువు పెరగక పోవడం, ఎదుగుదలలో లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మరికొందరు చిన్నారులు జంక్‌ ఆహార పదార్థాలు తినడం ద్వారా ఊబకాయులుగా మారుతున్నారు. ఇంట్లో పౌష్టికాహారం తయారు చేసే అవకాశం ఉన్నా తల్లిదండ్రులు యాంత్రిక జీవనానికి అలవాటుపడి పిల్లల అనారోగ్యానికి కారకులవుతున్నారు. తనిఖీ చేయాల్సిన ఆహార కల్తీ నియంత్రణ శాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులు.. తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కథనం...


పిల్లలు తినే ఆహార పదార్థాల నాణ్యతను తేల్చేందుకు అధికారులు లేరని ఆహార భద్రతామండలి సర్వే స్పష్టం చేసింది. మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాకు కేవలం ఒక గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఒక ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ మాత్రమే ఉన్నారు. వీరికి కొత్తగా ఏర్పాటైన నాలుగు జిల్లాలతో పాటు ఇతర జిల్లాలకు సైతం ఇన్‌ఛార్జి బాధ్యతలు ఇచ్చారు. దీంతో ఎక్కడా తనిఖీలు, నాణ్యతా పరీక్షలు చేసేందుకు వీలుకావడం లేదు. పాఠశాలల సమీపంలో చిల్లర దుకాణాలు ఏర్పాటు చేశారు. నాణ్యత లేని రంగులు వాడి చేసిన తినుబండారాలు విద్యార్థులను ఆకర్షించే విధంగా పెడుతున్నారు. పాఠశాల పక్కనే దుకాణాలు వెలుస్తున్నాయి. తక్కువ ధరకు నాణ్యత లేని తినుబండారాలను అమ్ముతున్నారు. వీటిని తినడం ద్వారా విద్యార్థులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. సర్వేలోనూ ఆహార భద్రత మండలి ఇదే విషయాన్ని గుర్తించింది.



పంటి సమస్యలే అధికం..: ఉమ్మడి జిల్లా పరిధిలో ఆర్‌బీఎస్‌కే కార్యక్రమం అమలు చేసిన తర్వాత పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో వైద్యులు వెళ్లి పరీక్షలు నిర్వహించగా పంటి సమస్యలు వస్తున్న విద్యార్థులు అధికంగా ఉన్నారు. ఇప్పటి వరకు 28 వేల మంది పంటి సమస్యలతో బాధ పడుతున్నట్లు గుర్తించారు. ప్రధానంగా చాక్లెట్లు, ఇతర తినుబండారాలు తినడంతోనే దంత సమస్యలు వస్తున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు.



నిబంధనల పట్టింపు ఏదీ?: పాఠశాల ప్రాంగణ పరిసరాల్లో, సమీప ప్రాంతాల్లో తినుబండారాలు అమ్మరాదన్న నిబంధన ఉన్నా దీన్ని విద్యాశాఖ, కల్తీ నియంత్రణ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఫుడ్‌సెఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ రెగ్యులేషన్‌ చట్టం ప్రకారం ఆ పదార్థాలను ప్రచారం కూడా చేయకూడదు. జంక్‌ ఫుడ్‌ తినడంతో ఊబకాయం, మధుమేహం, క్యాన్సర్‌, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ వీటి గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు.


తనిఖీలు అంతంతే..: ఉమ్మడి జిల్లాలో ఆహార కల్తీ నియంత్రణ శాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. కొత్తగా జిల్లాలు ఏర్పడిన తర్వాత ప్రతి జిల్లాకు ఒక కార్యాలయం ఇచ్చారు. వాటిని తెరవడానికి కూడా సిబ్బందిని నియమించలేదు. కనీసం జిల్లాకు ఒక ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉండాలి. అలాంటిది అయిదు జిల్లాలకు సంబంధించి కేవలం ఒక గెజిటెడ్‌ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఒక ఇన్‌స్పెక్టర్‌తో నెట్టుకొస్తున్నారు. వీరికి ఇతర జిల్లాల బాధ్యతలు కూడా అప్పగించారు.



ఇంటి నుంచే పంపడం మంచిది..: పిల్లలకు ఇంటి నుంచే ఆహార పదార్థాలను తయారు చేసి పంపడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పోషకాలు కలిగిన పప్పుదినుసులు, చిరు ధాన్యాలు, ఆకుకూరలతో ఆహార పదార్థాలు ఎంతో మంచివి. చాలా మంది రోజూ ఒకే విధమైన ఆహారం తయారు చేసి బాక్సుల్లో పెడుతుండటంతో పిల్లలు వాటిని తినకుండా బయట చిరుతిళ్లపై ఆసక్తి చూపుతున్నారు. రోజుకో రకం వంటకం చేస్తే విద్యార్థులు ఇష్టంగా తినే అవకాశం ఉంది.




చిరుతిళ్లతోనే సమస్యలు


- డా.శ్రీకాంత్‌, దంత వైద్య నిపుణుడు, ఆర్‌బీఎస్‌కే కేంద్రం, మహబూబ్‌నగర్‌


ఉమ్మడి జిల్లాలో పంటి సమస్యలతో బాధ పడుతున్న పిల్లల సంఖ్య కొంచెం ఎక్కువగా ఉంది. చాక్లెట్లు, జంక్‌ ఫుడ్‌ను ఎక్కువగా తింటున్నారు. అవి తిన్న తరవాత నోటిని శుభ్రం చేసుకోవడం లేదు. అవి పంటి మీద ఉండి పోయి పళ్లను దెబ్బతిస్తున్నాయి. ఎప్పటికప్పుడు నోటిని శుభ్రం చేసుకుంటే కొంత వరకు సమస్య బారిన పడే వారి సంఖ్య తగ్గే అవకాశం ఉంది.




ఎదుగుదలలో లోపం..


- డా.జగదీష్‌, చిన్నపిల్లల వైద్య నిపుణుడు, జనరల్‌ ఆస్పత్రి


చిరుతిళ్ల కారణంగా ఉమ్మడి జిల్లాలో ఎక్కువ చిన్నారుల్లో ఎదుగుదలలో లోపం కనిపిస్తోంది. బరువు పెరుగకపోవడం కూడా గమనించా. తరచూ దగ్గు, ఊపిరితిత్తుల్లో సమస్యలు వస్తున్నాయి. కొందరిలో విటమిన్‌ లోపాలు బయటపడ్డాయి. ఎదిగే సమయంలో కడపునొప్పితో పాటు ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇంట్లో వండిన ఆహారం తినిపించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. పాఠశాలల్లో విద్యార్థులు జంక్‌ఫుడ్‌ తినకుండా ఉపాధ్యాయులు చూడాలి.




పోషకాలతో..


- శైలజ, పోషకాహార నిపుణురాలు, జనరల్‌ ఆస్పత్రి


బయట దొరికే తినుబండారాలను ఇంట్లో పప్పుదినుసులు, ఆకుకూరలతో తయారు చేసుకోవచ్ఛు పిల్లలకు ఒకే రకమైన ఆహారం పెట్టకుండా రోజుకో ఓ కొత్త తరహా వంటకాలు పెట్టాలి. పిల్లలు ఆకుకూరలు తినకుండా తీసి పడేస్తుంటారు. అందుకని గ్రైండ్‌ చేసి వాటిని ఆహారంలో కలిపి తినిపిస్తే పోషకాలు లభిస్తాయి. చాలామంది తమ పిల్లలకు పండ్లు తినిపిస్తున్నా ఎదుగుదల, బరువు లేదని చెబుతున్నారు. మాంసకృతులు, పప్పుదినుసులు, ఆకుకూరలు, పాలు, పండ్లు తినిపిస్తేనే ఆరోగ్యవంతంగా ఎదిగేందుకు అవకాశం ఉంది.