అంతర్జాతీయ సంకేతాలు, దేశీయ పరిణామాల నేపథ్యంలో గత వారం మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఇరాన్ మిలిటరీ ఉన్నతాధికారి సులేమానీని అమెరికా హతమార్చడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా రాజుకున్నాయి. అంతర్జాతీయ సెంటిమెంట్‌పై ఇది ప్రతికూల ప్రభావం చూపింది. దేశీయంగా చూస్తే.. ద్రవ్యలోటు నవంబరులో మరింత పెరిగింది. ఫలితంగా వరుసగా మూడో ఏడాదీ ద్రవ్యలోటు లక్ష్యం కంటే ఎక్కువగా నమోదు కావచ్చన్న ఆందోళనలు పెరిగాయి. వచ్చే అయిదేళ్లలో మౌలిక రంగంపై రూ.102 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించడం సెంటిమెంట్‌ను మెరుగుపరిచింది. డిసెంబరులో భారత తయారీ పీఎంఐ ఏడు నెలల గరిష్ఠానికి చేరింది. ఈ నెల 15న అమెరికా- చైనా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలిచ్చారు. అయితే వారం చివర్లో మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు రాజుకోవడం మార్కెట్లు పడిపోడానికి కారణమైంది. ఈ ఉద్రిక్తతలతో ముడిచమురు ధర బాగా పెరిగింది. పసిడి ధరలు నాలుగు నెలల గరిష్ఠానికి చేరాయి. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్ 0.3 శాతం నష్టంతో 41,464 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 0.2 శాతం తగ్గి 12,226 పాయింట్ల దగ్గర స్థిరపడింది. లోహ, యంత్ర పరికరాలు, విద్యుత్ షేర్లు రాణించగా, మన్నికైన వినిమయ వస్తువులు, బ్యాంకింగ్, వాహన స్క్రిప్‌లు డీలాపడ్డాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.497 కోట్ల షేర్లను, డీఐఐలు, ఫండ్లు రూ.1540 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఈ నెలలో మొదటి మూడు ట్రేడింగ్ సెషన్లలోనే ఎఫ్‌పీఐలు రూ.2,418 కోట్లు వెనక్కి తీసుకోవడం గమనార్హం.
లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 1:1గా నమోదు కావడం..
ఎంపిక చేసిన మధ్య, చిన్న షేర్లలో కొనుగోళ్లను సూచిస్తోంది.
ఈవారంపై అంచనా
గరిష్ఠ స్థాయిల్లో మార్కెట్‌కు మళ్లీ నిరోధం ఎదురు కావడంతో గత వారం సెన్సెక్స్ స్వల్ప నష్టాలతో ముగిసింది. స్వల్పకాలంలో సెన్సెక్స్‌కు 41,000 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించే అవకాశం ఉంది. ఈ స్థాయి కోల్పోతేనే.. మార్కెట్ దిద్దుబాటుకు ఆస్కారం ఉంటుంది.
ప్రభావిత అంశాలు
అంతర్జాతీయ సంకేతాలు, కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఈ వారం మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయి. ముడిచమురు కదలికలు సైతం కీలకం కానున్నాయి. అమెరికా- ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరగడం మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపొచ్చు. ముడిచమురు ధరలు మరింత పెరిగితే.. ఇప్పటికే మందగమనంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థపై మరింత భారం పడొచ్చు. ఇది మార్కెట్ నష్టాలకు దారితీయొచ్చు. దేశీయంగా చూస్తే.. కంపెనీలు మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. 9న టీసీఎస్, 10న ఇన్ఫోసిస్ ఫలితాలు వెలువరించనున్నాయి. 6న విడుదల కానున్న సేవల రంగ పీఎంఐ, 10న రానున్న పారిశ్రామికోత్పత్తి గణాంకాలపై మదుపర్లు దృష్టి పెట్టొచ్చు. ముడిచమురు ధరల వల్ల డాలర్‌తో పోలిస్తే రూపాయిపై ఒత్తిడి పెరగొచ్చు. రూపాయి 72.5 స్థాయి దాటితే.. మరింత బలహీనపడే అవకాశం ఉంది. ఎగుమతి ఆధారిత ఐటీ, ఔషధ షేర్లకు మాత్రం ఇది కలిసొచ్చే అంశం. అంతర్జాతీయంగా చూస్తే.. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన వార్తలు, గణాంకాల నుంచి మదుపర్లు సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు.
తక్షణ మద్దతు స్థాయిలు: 41,184, 40,917, 40,490; నిరోధ స్థాయిలు: 41,820, 42,000, 42,450
మార్కెట్ 41,000 పాయింట్ల దిగువకు చేరితేనే.. దిద్దుబాటుకు ఆస్కారం ఉంటుంది.