అంధకారంలో ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు’


పట్టాభిపురం: ముఖ్యమంత్రి జగన్‌ అవలంభిస్తున్న విధానాలతో ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు అంధకారంగా తయారయ్యే దుస్థితి దాపురించిందని ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ విమర్శించారు. రాజధాని అమరావతిపై వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా కలెక్టరేట్‌ ఎదుట రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లా తెదేపా ఎస్టీసెల్‌ అధ్యక్షుడు ధారునాయక్‌ ఆధ్వర్యంలో ఆదివారం రిలే నిరాహార దీక్షల్లో ఎస్సీ సెల్‌ నాయకులు పాల్గొన్నారు. దీక్షలు చేస్తున్న వారికి రామకృష్ణ, మిర్చియార్డు మాజీ ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపజేశారు. రామకృష్ణ మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సీఎం జగన్‌ దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్కసారి అవకాశం ఇవ్వమని కుటుంబం అంతా ప్రాధేయపడితే ప్రజలు ఓట్లేసి గెలిపించారన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని ప్రజలు అధికారం ఇస్తే అర్థం పర్థం లేని నిర్ణయాలతో అధోగతి పాల్జేస్తున్నారని ధ్వజమెత్తారు. మన్నవ మాట్లాడుతూ జగన్‌కు బెయిల్‌ రద్దయితే ఆంధ్ర ప్రజలకు మంచి రోజులు వస్తాయన్నారు. ఈనెల 7న జరిగే జాతీయ రహదారి దిగ్బంధన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ఉదయం దీక్షలను మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, గుంటూరు తూర్పు ఇన్‌ఛార్జి మహ్మద్‌ నసీర్‌, నగర పార్టీ అధ్యక్షుడు డేగల ప్రభాకర్‌, షేక్‌ లాల్‌వజీర్‌, జనసేన నాయకులు గాదె వెంకటేశ్వరరావులు ప్రారంభించారు. కార్యక్రమంలో రామదాస్‌, వెంకటనరసింహారావు, తావులాల్‌ నాయక్‌, రామకృష్ణ, సైదా నాయక్‌, కంచర్ల శివరామయ్య, ఎర్రగోపు నాగేశ్వరరావు, కొత్తూరి వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.