ప్రపంచ అగ్రశ్రేణి శాస్త్రవేత్తగా డాక్టర్‌ అక్కినెపల్లి

హైదరాబాద్‌ (ఆరోగ్యజ్యోతి): రాష్ర్టానికి చెందిన ప్రముఖ వైద్య శాస్త్రవేత్త డాక్టర్‌ అక్కినెపల్లి రఘురామ్‌రావుకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికా, కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా  వైద్యశాస్త్రవేత్తలు, ఐఐటీ, ఐఐఎస్‌, ఫిజిక్స్‌, మెటీరియల్‌ సైన్స్‌, ఫార్మాస్యూటికల్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, ప్లాంట్‌ బయాలజీ, ఎనర్జీ తదితర  రంగాల నిపుణులపై 22 ప్రధాన అంశాలు, 176 విభాగాల ఆధారంగా నిర్వహించిన ఒక సర్వేలో  టాప్‌ 2% శాస్త్రవేత్తలను గుర్తించింది. ఈ శాస్త్రవేత్తలు రాసిన జనరల్స్‌ ప్రముఖ ‘పీఎల్‌ఓఎస్‌ బయాలజీ’ పబ్లికేషన్స్‌లో ప్రచురితమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన టాప్‌ 2% శాస్త్రవేత్తల్లో భారతదేశానికి సంబంధించి 1000 మంది గుర్తింపు పొందగా అందులో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ప్రముఖ ‘మెడిసినల్‌, బయోమాలిక్యులర్‌ కెమిస్ట్రీ’ శాస్త్రవేత్త డాక్టర్‌ అక్కినెపల్లి రఘురామ్‌రావుకు గుర్తింపు లభించింది. 1984లో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి గోల్డ్‌మెడల్‌ సాధించిన డా.రఘురామ్‌రావు కాకతీయ యూనివర్సిటీ నుంచి ఫార్మాసీలో పీహెచ్‌డీ పూర్తి చేశారు.