కే . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి ఎడిటర్ ( 7013260176, 9848025451)
- ఏఎన్‌ఎం అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.అనసూయ
హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): ఏఎన్‌ఎంల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఏఎన్‌ఎం అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.అనసూయ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఏఎన్‌ఎంలతో కలిసి కోఠిలోని ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ వాకాటి కరుణను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 వేల మంది ఏఎన్‌ఎంలకు గ్రామాలు, మండలాల్లోని గర్భిణులు, పసికందుల వివరాల నమోదు చేసేందుకు గాను గతంలో బీఎస్‌ఎన్‌ఎల్ 2జీ ట్యాబ్‌లను ఇవ్వడం జరిగిందన్నారు. అవి పని చేయక పోవడంతో పసి పిల్లలకు ఇచ్చే ఇంజక్షన్‌ల వివరాలు, గర్భిణుల వివరాలను నమోదు చేసేందుకు ఇబ్బందికరంగా ఉందన్నారు. నేషనల్ కంట్రోల్ ప్రోగ్రామ్స్‌కు సంబంధించిన వివరాలను నమోదు చేసేందుకు వీలు కావడం లేదన్నారు. అందుకోసం 4జీతో కూడిన జియో ట్యాబ్‌లను ఇస్తే వివరాలను త్వరితగతిన నమోదు చేయడంతో పాటు గర్భిణులకు డెలివరీ తేదీలకు సంబంధించి చిన్నారుల టీకాల వివరాలను వారి తల్లిదండ్రులకు తెలియ జేసేందుకు వీలవుతుందని ఆమె పేర్కొన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మెటర్నిటీ సెలవులు ఇస్తున్నప్పటికీ ఆరు నెలల పాటు జీతాలు రావడం లేదని తెలిపారు. ఉద్యోగుల ప్రమోషన్‌లు సైతం నిలిచి పోయాయని ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని కమిషనర్ దృష్టికి తీసుకురాగా ఆమె స్పందించి వెంటనే ట్యాబ్ అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు అన్ని సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారని అనసూయ తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామలక్ష్మి, సభ్యురాళ్లు దేవిక, భవాని, సుజాత, కిరణ్మయి పాల్గొన్నారు