హైదరాబాద్(ఆరోగ్యజ్యోతి): కరోనా బారిన పడ్డారో లేదో
తెలుసుకోడానికి ఇప్పటివరకూ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, లాబ్‌లు ఆర్‌టీ-పీసీఆర్, రాపిడ్ యాంటీజెన్
టెస్టులు మాత్రమే చేస్తున్నారు. కానీ, నగరంలోని సీసీఎంబీ
(సెంటర్ పర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ), కేంద్ర ప్రభుత్వానికి
చెందిన సీఎస్ఐఆర్ (కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి) సంయుక్త
సహకారంతో ఇటీవల ‘డ్రై
స్వాబ్’ టెక్నాలజీతో
కొత్త తరహా (డైరెక్ట్ యాంప్లిఫికేషన్ రాపిడ్ ఆర్‌టీ-పీసీఆర్) కరోనా టెస్టింగ్
సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇది చౌక మాత్రమే కాక అరగంట వ్యవధిలోనే ఫలితాలు
వస్తాయని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. అపోలో హాస్పిటల్స్
గ్రూపుతో ఎంఓయూ కుదిరినందున ఇకపైన ఆ గ్రూపుకు చెందిన ఆసుపత్రుల్లో తక్కువ
ఖర్చుతోనే కరోనా టెస్టులు చేయించుకునే వెసులుబాటు లభిస్తుందని పేర్కొన్నారు.
ఇంతకాలం
అవలంబించిన రాపిడ్ టెస్టుల్లో ముక్కు లేదా గొంతు నుంచి స్వాబ్‌ల ద్వారా శాంపిళ్ళను
తీసుకున్న తర్వాత దాన్ని వీటీఎం (వైరల్ ట్రాన్స్‌పోర్టు మీడియం) అనే ద్రవంలో ఉంచి
లేబ్‌కు తరలించాల్సి వస్తుందని, కానీ ఇప్పుడు ఆలాంటిదేదీ లేకుండా నేరుగా టెస్టు
చేయవచ్చునని పేర్కొన్నారు. ఈ నూతన పద్ధతిలో టెస్టింగ్ చేయడానికి ప్రత్యేకంగా కిట్‌లు
అవసరం లేదని పేర్కొన్నారు. ఖరీదైన రీఏజెంట్ అనే మెడిసిన్‌ను కూడా వాడాల్సిన
పనిలేదని, ఇప్పుడు
చేస్తున్న ఖర్చులో సగం తగ్గుతుందని పేర్కొన్నారు.
అపోలో
ఆసుపత్రి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి మాట్లాడుతూ, చౌక ధరలకు సామాన్యులకు
కరోనా టెస్టు అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో సీసీఎంబీతో అవగాహన
కుదుర్చుకున్నట్లు తెలిపారు. కరోనా కాలంలో చాలా ఆంక్షల నడుమ బతికామని, ఇప్పుడు
ఆంక్షలన్నీసడలిపోయి మామూలు పరిస్థితులు నెలకొన్నందున తక్కువ ధరకు టెస్టులు
అందుబాటులోకి రావడం ద్వారా ప్రాథమిక దశలోనే గుర్తించడానికి వీలవుతుందని, ఇతరులకు వ్యాపించకముందే
జాగ్రత్త పడవచ్చని అన్నారు.