పంజాగుట్ట, హైదరాబాద్ (ఆరోగ్య జ్యోతి): పీజీ చదువుతున్న వైద్య విద్యార్థినిని తరచూ వేధిస్తున్న ఓ వైద్యుడిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నిమ్స్ ఆస్పత్రిలో ఓ వైద్యురాలు పీజీ రెండో సంవత్సరం చదువుతోంది. ఆస్పత్రి ఆవరణలోని హాస్టల్లో ఉంటోంది. రెండేళ్ల క్రితం ఫేస్‌బుక్ ద్వారా సిద్ధార్థ అనే వైద్యుడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు వైద్యులే కావడంతో స్నేహితులయ్యారు. కొద్దిరోజుల తర్వాత వివాహం చేసుకుందామని ప్రతిపాదనను సిద్ధార్థ ఆమె ముందు ఉంచాడు. అప్పటికే ఆమెకు ఇంట్లో సంబంధాలు చూడటంతో అతని ప్రతిపాదనను తిరస్కరించింది. అప్పటినుంచి ఆమెను వేధించడం ప్రారంభించాడు. ఆమెకు కాబోయే భర్తకు మెసేజ్‌లుపెట్టడమే కాకుండా ఫోన్‌లు కూడా చేసేవాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె సిద్ధార్థను నిలదీయడంతో స్నేహితుడితో కలిసి ఫోన్‌లు, మెసేజ్‌లు చేసినట్లు అంగీకరించాడు. నాటినుంచి ఆమె అతనికి దూరంగా ఉంటూ వచ్చింది. ఇది తట్టుకోలేని సిద్దార్థ మెసేజ్‌లు పెట్టడమే కాకుండా స్వయంగాను, మరికొన్నిసార్లు తనసోదరితోను ఫోన్‌లు చేయించి ఆమెను పలుమార్లు వేధించాడు.
అతని కుటుంబ సభ్యులు కూడా సిద్ధార్థను పెళ్లి చేసుకోవాలని ఆమెపై ఒత్తిడి తెచ్చారు. అంతేకాకుండా ఆమె ఉంటున్న హాస్టల్ గదికి వచ్చి ఆమెను ఇబ్బంది పెట్టడం, మద్యంతాగి అర్ధరాత్రి వేళ హాస్టల్‌ముందు హంగామా చేస్తూ ఆమెను వేధించేవాడు. రోజురోజుకూ సిద్దార్థ వేధింపులు ఎక్కువ కావడంతో విసిగిపోయిన వైద్య విద్యార్థిని పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.