శిశువు ఇక భద్రం..

  కే . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి ఎడిటర్ ( 7013260176, 9848025451)


  • తగ్గుముఖం పట్టిన నవజాత శిశుమరణాలు 
  • నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వేలో వెల్లడి 
  • 2015-16తో పోల్చితే 4 శాతం తగ్గుముఖం 
  • ప్రతి జిల్లాలో నియోనాటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ ఏర్పాటు 

పిల్లలు తల్లిదండ్రులకు వరం. సంతానం కోసం ఎన్నో కలలు కంటారు. తమ కలలను కళ్లారా చూసుకుంటూ ఎంతో మురిసిపోతుంటారు. అయితే నవమాసాల తర్వాత అనారోగ్య సమస్యలతో పుట్టుకలోనే కొందరు చిన్నారులు కన్నుమూస్తుంటారు. గర్భస్థ దశలో సరిగ్గా ఎదగకపోవడం, రక్తహీనతతోపాటు పలు సమస్యలతో ఆయువు తీరిపోతుంది. టీఆర్‌ఎస్‌ సర్కారు పగ్గాలు చేపట్టాక ఆరేండ్ల కాలంలో నవజాత శిశుమరణాల రేటు తగ్గుముఖం పట్టినట్లు జాతీయ ఆరోగ్య సర్వే (నేషనల్‌ హెల్త్‌ సర్వే) స్పష్టం చేసింది. వైద్యరంగంలో వచ్చిన మార్పులు, ఆధునిక వసతుల కల్పన వల్లే ఇది సాధ్యమైంది. 

రాష్ట్రంలో నవజాత శిశుమరణాలు తగ్గుముఖం పట్టాయి. మాతా శిశుమరణాలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా చర్యలు తీసుకుంటుండడంతోపాటు దవాఖానల్లో సకల వసతులు కల్పిస్తున్నది. ప్రతి జిల్లా దవాఖానలో ఎంఐసీయూ(మదర్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌), ఎన్‌ఐసీయూ(నియోనాటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌)తోపాటు లెవల్‌-1 కేర్‌ యూనిట్లు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఎదిగేందుకు గర్భిణులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారమివ్వడం, కేసీఆర్‌ కిట్‌, అమ్మఒడి పథకాలు శిశు మరణాలు తగ్గుముఖం పట్టేందుకు దోహదపడ్డాయి. ప్రధానంగా ఇనిస్టిట్యూషనల్‌ డెలివరీలు పెంచడంతో తల్లీబిడ్డలను సంరక్షించగలుగుతున్నారు. నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే-4 (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌) ప్రకారం 2015-16లో నవజాత శిశుమరణాలు 20 శాతం ఉండగా, 2019-20లో 16.8 శాతానికి తగ్గింది. అంటే 2015-16తో పోల్చితే 2019-20 మధ్యకాలంలో నెలలోపు వయస్సు ఉన్న నవజాత శిశుమరణాల రేటు 3.2 శాతం తగ్గినట్లు ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ వెల్లడించింది. నవజాత శిశుమరణాలతోపాటు ఏడాదిలోపు శిశుమరణాలు(ఇన్‌ఫాంట్‌ మోర్టాలిటీ)రేటు కూడా తగ్గినట్లు ఈ సర్వేలో తేలిందని నిలోఫర్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ నరహరి తెలిపారు. 2015-16తో పోల్చితే ఇన్‌ఫాంట్‌ మోర్టాలిటీ రేటు 2019-20లో 1.3శాతం తగ్గినట్లు వివరించారు.