‘పల్స్‌ పోలియో’ను విజయవంతం చేద్దాం

 

  • మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ శ్వేతా మహంతి
  • 17న పల్స్‌ పోలియో కార్యక్రమం

మేడ్చల్(ఆరోగ్యజ్యోతి): పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మేడ్చల్‌ - మల్కాజిగిరి కలెక్టర్‌ శ్వేతా మహంతి అన్నారు. ఈ నెల 17న నిర్వహించనున్న పల్స్‌ పోలియో కార్యక్రమంపై మేడ్చల్‌ కలెక్టరేట్‌ కార్యాలయంలో జిల్లా వైద్యాధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు గుర్తించిన 4,21,509 మంది చిన్నారులకు 1,091 కేంద్రాల ద్వారా 2,182 బృందాలు చుక్కల మందు వేయనున్నట్లు వివరించారు. 18, 19వ తేదీలలో ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి తిరిగి చుక్కలు వేస్తారన్నారు. కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించడానికి సర్పంచ్‌లను భాగస్వామ్యులను చేయాలని సూచించారు. 

కొవిడ్‌ వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించండి..

జిల్లా వ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖకు కలెక్టర్‌ సూచించారు. వ్యాక్సిన్‌ అందజేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ వైద్య బృందాలను సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రజలకు దశల వారీగా వ్యాక్సిన్‌ అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. వ్యాక్సిన్‌పై ఉన్న భయాందోళలను తొలగించాలన్నారు. జిల్లా వైద్యాధికారి మల్లికార్జునరావు పాల్గొన్నారు.