- అనుమతుల్లేకపోవడమే కారణం
కరీంనగర్ (ఆరోగ్యజ్యోతి): వైద్య, ఆరోగ్య శాఖ నుంచి ఎలాంటి
అనుమతులు లేకుండా కరీంనగరంలో నిర్వహిస్తున్న శ్రీ గురుకుల ఆయుర్వేద వైద్య శాలను ఆదివారం ఆయుష్ విభాగం వరంగల్
రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ రవి నాయక్ సీజ్ చేశారు. ఆయన తెలిపిన వివరాల
ప్రకారం.. నగరంలోని హౌసింగ్ బోర్డుకు చెందిన డీ రాజయ్య అనే రిటైర్డ్ ఉద్యోగి
మోకాళ్ల నొప్పులతో శ్రీ గురుకుల
ఆయుర్వేద వైద్యశాలకు వెళ్లగా, పరీక్షించిన వైద్యశాల డాక్టర్ శేషగిరి రావు రెండు రకాల
లేహ్యాలు కలిపి ఇచ్చి 2.20 లక్షలు
తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అనుమానం వచ్చిన రాజయ్య కొడుకు వరంగల్‌లోని ఆయుష్
విభాగానికి సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలో ఆదివారం ఆర్‌డీడీ తనిఖీ చేయగా, ఆ సమయంలో శేషగిరి రావు
అందుబాటులో లేరు. దీంతో అతను ఇచ్చిన లేహ్యాన్ని పరిశీలించారు. కొంత అనుమానం
రావడంతో పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపుతున్నట్లు రవినాయక్
తెలిపారు. ఆయన మాట్లాడుతూ శ్రీ గురుకుల ఆయుర్వేద వైద్యశాల నిర్వహణకు, మందులు విక్రయించేందుకు తమ
శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. రాజయ్యకు ఇచ్చిన మందులు అసలివా..? నకిలీవా..? అనేది తెలుసుకునేందుకు
వాటిని హైదరాబాద్‌కు పంపిస్తున్నామని, పరీక్షల్లో నకిలీవని తేలితే వైద్యశాలను శాశ్వతంగా మూసి
వేస్తామని, వైద్యుడిపై
చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.