వ్యాక్సినేషన్ కేంద్రాలలో టీకా కార్యక్రమము

 

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి, కరీంనగర్, డా.జి.సుజాత

కరీంనగర్,(ఆరోగ్యజ్యోతి): ప్రభుత్వ ఆదేశానుసారము, (ఆదివారము) కూడా జిల్లా వ్యాప్తముగా అన్ని వ్యాక్సినేషన్ కేంద్రాలలో టీకా కార్యక్రమము కొనసాగుతుందని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా.జి.సుజాత తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  (45) సంవత్సరాలు దాటిన ప్రతిఒక్కరూ, తమకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కోవిడ్ వాక్సిన్ తీసుకొనవచ్చని ఆమె తెలిపినారు.ప్రజలు అధిక సంఖ్యలో వ్యాక్సిన్ తీసుకోవాలని అన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడము, మాస్కు ధరించడము మరియు భౌతిక దూరము పాటించడము ద్వారా మాత్రమే కోవిడ్ వ్యాప్తిని అరికట్టవచ్చనని పేర్కొన్నారు.జిల్లా వ్యాప్తముగా (28) కోవిడ్ టీకా వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసామని, (22) ప్రభుత్వ ప్రాథమిక పట్టణ ఆరోగ్య కేంద్రాలలో, (6) ప్రైవేట్ ఆసుపత్రులలో (1560) మంది కోవిన్ 2.0 యాప్ లో తమ పేర్లు నమోదు చేసుకున్నారని (1566) మంది మొదటి డోస్ కోవిడ్ టీకా తీసుకున్నారని, జిల్లాలో ఈరోజు 99.74% వ్యాక్సినేషన్ జరిగినదని తెలిపారు. అన్ని ప్రభుత్వ ప్రాథమిక మరియు పట్టణ ఆరోగ్య కేంద్రాలలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు యధావిధిగా జరుగుతున్నాయని, జలుబు, దగ్గు, జ్వరము, తలనొప్పి, ఒంటి నొప్పులు, ఐ ఎల్ ఐ లక్షణాలు ఉన్నవారు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తమకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, తమ కోవిడ్ స్టేటస్ ను తెలుసుకోవాలని అన్నారు.  పాజిటివ్ వచ్చిన వారు తప్పనిసరిగా హోమ్ ఐసోలేషన్ పాటించాలని, వైద్యుల సూచనల మేరకు మందులు వాడుకోవాలని, స్వంత వైద్యము తీసుకోవద్దని, అత్యవసరమైతే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాలని అన్నారు.  పాజిటివ్ వచ్చిన వారితో సన్నిహితముగా ఉన్న ప్రతి ఒక్కరూ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. ప్రజలు అనవసర ప్రయాణాలు మానుకోవాలని, అవసరమైతేనే ప్రయాణాలు చేయాలని, పిల్లలు మరియు వృద్ధులు ఇంటికే పరిమితము కావాలని అన్నారు.  ఎలాంటి అశ్రద్ధ చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.జి.సుజాత తెలిపారు.