కన్నతల్లిని బాత్రూమ్‌లో బంధించిన ప్రబుద్ధుడు

 15 రోజులు ఆకలితో అల్లాడిన వృద్ధురాలు

ప్యారీస్‌(చెన్నై): నెలనెలా కన్నతల్లి ఇచ్చే పింఛను మేస్తూ.. ఆమెకు మాత్రం ఒకముద్ద పెట్టాల్సి వస్తుందని బాత్రూమ్‌ లో బంధించిన ఓ కసాయి ఉదంతమిది. ఆఖరికి చుట్టుపక్కల వారు దీనిని గమనించి ఆమెను బయటకు తీయడంతో బతికిపోయింది. ఈ ఘటన సేలంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే... సేలం సూరమంగళం హౌసింగ్‌ బోర్డు క్వార్టర్స్‌లోని ఓ ఇంటిలో స్నానాల గది నుంచి వృద్ధురాలు మూలుగుతున్న శబ్దం వినిపించింది. ఇది విని అక్కడికి వెళ్లిన ఇరుగు పొరుగు వారు ఆ ఇంటి తలుపులు తెరి చేందుకు ప్రత్నించినా సాధ్యం కాలేదు. దీంతో జిల్లా కలెక్టర్‌ కార్మేగంకు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ వెంటనే సాంఘిక సంక్షేమ శాఖ అధికారులకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అధికారులు బోదిమరం అనే స్వచ్ఛంధ సంస్థ ప్రతినిధులతో కలసి వృద్ధురాలిని బంధించిన ఇంటికి వెళ్లి తలుపులు బద్దలుకొట్టి లోనికి వెళ్లారు. వారు స్నానాల గది తలుపు తెరచి చూడగా అక్కడ 90 ఏళ్ల వృద్ధురాలు ప్రాణాపాయంతో మూలుగుతుండడం చూసి దిగ్ర్భాంతి చెందారు. వారు జరిపిన విచారణలో, రాధ (95) అనే ఆ వృద్ధురాలు హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేసిన రాజగోపాల్‌ భార్య అని, ఈ దంప తులకు నలుగురు కుమారులు జన్మించగా, వారిలో ఇద్దరు మరణించినట్టు తెలిసింది. మిగిలిన ఇద్దరిలో ఒక కుమారుడు ఏ ప్రాంతంలో ఉన్నాడో కూడా ఇప్పటివరకు జాడ తెలియలేదు. ఇక, దాల్మియా బోర్డులో మెకానిక్‌గా పనిచేస్తున్న నాలుగో కుమా రుడి ఇంట్లో వృద్ధురాలు నివసిస్తూ, తనకు వచ్చే నెల పింఛన్‌ రూ.12 వేలు కుమారు డికే ఇచ్చి సహాయపడుతోంది. అయితే, కరుడుగట్టిన కుమారుడు కన్నతల్లి అని ఆలోచించకుండా సరైన ఆహారం ఇవ్వకుండా ఆమెను స్నానాల గదిలో బంధించి చిత్రహింసలు పెడుతున్నట్టు తెలిసింది. ఈ రకంగా ఆమె 15 రోజులకు పైగా అన్నం, నీరు లేక అల్లాడిపోయినట్టు విచా రణలో తేలింది. ఆమె కుమారుడికి అధికారులు ఫోన్‌ చేయగా తన తల్లి మరణిస్తే మీరే అంత్యక్రియలు నిర్వహించండి అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి ఫోన్‌ కట్‌ చేసినట్టు తెలిసింది. దీంతో, ఆ వృద్ధురాలిని బోదిమరం ట్రస్ట్‌ వృద్ధాశ్రమానికి తీసుకెళ్లి ఆశ్రయం కల్పించారు.