ఆ వ్యాక్సిన్ల‌కు ట్ర‌య‌ల్స్ అవ‌స‌రం లేదు

 

న్యూఢిల్లీ,(ఆరోగ్యజ్యోతి): న్యూఢిల్లీ: ఇండియాలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయ‌డంలో భాగంగా డ్ర‌గ్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే వివిధ దేశాలు, డ‌బ్ల్యూహెచ్ అత్య‌వ‌స‌ర వినియోగానికి ఆమోదం పొందిన వ్యాక్సిన్ల‌కు ఇండియాలో మ‌ళ్లీ ట్ర‌య‌ల్స్ అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఈ నిర్ణ‌యంతో ఫైజ‌ర్‌, మోడెర్నాలాంటి వ్యాక్సిన్ల‌కు లైన్ క్లియ‌ర్ కానుంది. ఈ రెండు కంపెనీలు ఇప్ప‌టికే న‌ష్ట‌ప‌రిహారం, ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించ‌డం వంటి వాటిని ఎత్తేయాల‌ని కోరాయి. దేశంలో వ్యాక్సిన్ల‌కు ఉన్న డిమాండ్‌, భారీగా పెరిగిపోతున్న కేసుల నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు డీసీజీఐ చీఫ్ వీజీ సోమానీ వెల్ల‌డించారు.కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ల కోసం ఏర్పాటు చేసిన నిపుణుల బృందం డీసీజీఐకి ఈ సిఫార‌సు చేసింది. ఇప్ప‌టికే ప్ర‌పంచవ్యాప్తంగా కోట్ల మంది తీసుకున్న వ్యాక్సిన్లు, యూఎస్ ఎఫ్‌డీఏ, ఈఎంఏ, యూకే ఎంహెచ్ఆర్ఏ, పీఎండీఏ, జ‌పాన్ లేదా ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఎమ‌ర్జెన్సీ యూజ్ లిస్ట్‌లో ఉన్న వ్యాక్సిన్ల‌కు ఇండియాలో క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ అవ‌స‌రం లేద‌ని నిర్ణ‌యించిన‌ట్లు సోమానీ ఒక లేఖ‌లో తెలిపారు. గ‌తంలో విదేశాల్లో ట్ర‌య‌ల్స్ పూర్తి చేసి అనుమ‌తి పొందిన వ్యాక్సిన్లు కూడా ఇండియాలో బ్రిడ్జింగ్ ట్ర‌య‌ల్స్ లేదా ప‌రిమిత స్థాయిలో క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించాల‌న్న నిబంధ‌న ఉండేది. ఇప్పుడా నిబంధ‌న‌ను ఎత్తేశారు.