ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించిన సబ్‌ కలెక్టర్‌ హిమాన్షు కౌశిక్

 తూర్పుగోదావరి,(ఆరోగ్యజ్యోతి):వైద్య చికిత్సలకు వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వైద్యులను సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ సిబ్బందికి  సూచించారు.అమలాపురం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని అమలాపురం సబ్‌ కలెక్టర్‌ హిమాన్షు  కౌశిక్ బుధవారం తనిఖీ చేశారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కోవిడ్ పాజిటివ్‌ బాధితులకు అందుతున్న వైద్య సేవలు, ఆహారం, వైద్య పరీక్షలు, ఆర్టిపిసిఆర్ పరీక్షల ల్యాబ్ ఏర్పాటు పనులు, తదితర అంశాలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ ను ఆరా తీశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్యసేవలను గురించి ఆసుపత్రిలో వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. డివిజన్ లో కోవిడ్ పరీక్షల సామర్ధ్యాన్ని పెంచే విధంగా త్వరలో ఏర్పాటు చేయనున్న ఆర్టిపిసిఆర్ పరీక్షల నిర్వహణకు కేటాయించిన భవనం మరమ్మత్తు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఏపీఎంఎస్ ఐడిసి అధికారులను ఆదేశించారు.  ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్ధేశించిన మార్గదర్శకాలకు  అనుగుణంగా వైద్యులు, ఇతర సిబ్బంది పనితీరు ఉండాలని, రోగులకు జవాబుదారీ తనంతో కూడిన సత్వర, మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని  అన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న డయాలసిస్ వార్డును, కోవిడ్ వార్డులను, ఆర్టిపిసిఆర్ ల్యాబ్ ఏర్పాటుకు జరుగుతున్న పనులను సబ్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ పిపిఇ కిట్ ను ధరించి కోవిడ్ పాజిటివ్ బాధితులకు ఏర్పాటు చేసిన వార్డులను పరిశీలించి, వారికి అందుతున్న వైద్యసేవలను గురించి బాధితులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ పరిశీలనలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.ప్రభాకర్, అడిషనల్ డిఎం& హెచ్ఓ డా.పుష్కరరావు, ఏపీఎంఎస్ఐడిసి అధికారులు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.