తరుణ వ్యాధులపై అప్రమత్తం చేయండి

భద్రాచలం : చలి ముదిరినందున గిరిజనులకు ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీవో గౌతమ్‌ వైద్య శాఖను ఆదేశించారు. మారుమూల గ్రామాల్లో పని చేసే సిబ్బందిని అప్రమత్తం చేసి పల్లెల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. సోమవారం ఐటీడీఏలో ప్రజావాణి పేరిట గిరిజన దర్బారును నిర్వహించారు. ఈ తరుణంలో వచ్చే వ్యాధులపై జాగ్రత్తలను పాటించాలని వెల్లడించారు. విద్యార్థులకు వ్యాధులు రాకుండా చూసి అవసరమైన చోట్ల శిబిరాలను నిర్వహించాలని పేర్కొన్నారు. శాఖల వారీగా ప్రగతి నివేదికలను తెప్పించి పరిశీలించారు. అర్హులైన వారికి సకాలంలో ప్రభుత్వ పథకాలను మంజూరు చేయాలని సూచించారు. పోడు భూములకు పట్టాలు అందించి ఎల్టీఆర్‌ కేసులను పరిష్కరించాలని వివరించారు. కల్యాణ లక్ష్మి పథకం దరఖాస్తులను పరిశీలించి లబ్ధి చేకూర్చాలని చెప్పారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల నిమిత్తం వచ్చిన వినతులను ఆయా శాఖల అధికారులకు పంపించారు. నాగోరావు, భీమ్‌, బురాన్‌, రాములు, వాణి, అనురాధ, సులోచన, సురేందర్‌ పాల్గొన్నారు.