దవాఖానాకు దక్కిన గుర్తింపు ...ఈ-ఆసుపత్రి సేవల్లో దేశంలోనే 17వ స్థానం


నిజామాబాద్‌ :జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి దేశవ్యాప్త గుర్తింపు లభించింది. 'ఈ- ఆసుపత్రి' సేవల్లో 17వ స్థానం దక్కింది. దేశ వ్యాప్తంగా 345, తెలంగాణలో 32 దవాఖానాల్లో ఈ-సేవలు కొనసాగుతున్నాయి. ఇందూరు జనరల్‌ ఆసుపత్రికి గుర్తింపు దక్కడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.కేంద్ర సాంకేతిక, సమాచార, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ- ఆసుపత్రి పోర్టల్‌ను సెప్టెంబరు 2015లో ప్రారంభించింది. నిజామాబాద్‌ జిల్లా ఆసుపత్రిని 2017 ఫిబ్రవరి 3న అనుసంధానం చేశారు. అప్పటి కలెక్టర్‌


యోగితారాణా, సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ రాములు ప్రత్యేక దృష్టి సారించి ప్రారంభించారు.పక్కాగా అమలు చేసేందుకు ఎముకల వైద్యనిపుణుడు డాక్టర్‌ బన్సీలాల్‌కు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. నాటి నుంచి ఈ-ఆసుపత్రి సేవలు పక్కాగా కొనసాగుతున్నాయి. ఆసుపత్రికి వచ్చిన ప్రతి ఒక్కరి ఓపీ నమోదు, ఐపీ నమోదు ఆన్‌లైన్‌లో చేయడమే లక్ష్యంగా పనిచేశారు. ఈ సేవలతో దేశంలో ఎక్కడ చూసినా ఈ రోగి వివరాలు అందుబాటులో ఉంటాయి.


దేశంలోనే మెరుగైన ఫలితం


ఈ-ఆసుపత్రి సేవలు దేశంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొనసాగుతున్నాయి. సేవలు ప్రారంభించిన నాటి నుంచి నవంబరు వరకు లెక్కలు తీశారు. ఓపీ, ఐపీ విభాగంలో నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి దేశంలోనే 17వ స్థానంలో నిలిచింది. ఇక ప్రతి నెల ఓపీ నమోదు లెక్కల్లో డిసెంబరు నెలలో 33వ స్థానంలో ఉంది. ఈ నెల 25న క్రిస్మస్‌ రోజు ఓపీ లెక్కల్లో మాత్రం తొమ్మిదో స్థానం దక్కింది.




సంతోషంగా ఉంది : దీన్‌దయాళ్‌ బంగ్‌, ఆసుపత్రి సూపరింటెండెంట్‌


దేశంలోనే 17వ స్థానం దక్కడం అంతసులువైన విషయం కాదు. ప్రారంభం నుంచి అధికారులు కలిసికట్టుగా ముందుకెళ్లారు. ఓపీ, ఐపీతో పాటు మిగిలిన సేవలు నమోదు చేయాలంటే సిబ్బంది అవసరం. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఒకే సాఫ్ట్‌ వేర్‌ ఉపయోగిస్తే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.