జనవరి 19 నుంచి పల్స్‌పోలియో


గొడుగుపేట: జనవరి 19 నుంచి 21 వరకు మూడు రోజుల పాటు జరిగే పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి శర్మిష్ఠ వైద్యులకు పిలుపునిచ్చారు. శుక్రవారం మచిలీపట్నం జిల్లావైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లాలోని పీహెచ్‌సీ వైద్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో పల్స్‌పోలియో కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. విజయవాడ నగరంలో 22వ తేదీ కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో 3,79,420 మంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయాల్సి ఉందని చెప్పారు. వీటికోసం పట్టణ ప్రాంతాల్లో 589, గ్రామీణ ప్రాంతాల్లో 1979 చొప్పున మొత్తం 2,568 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 97 సంచార బృందాలు, బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్‌లు ఇతర కూడళ్లలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు 63 బృందాలను నియమించినట్లు వివరించారు. వైద్య ఆరోగ్యశాఖతోపాటు ఐసీడీఎస్‌, ఆశాకార్యకర్తలు ఇతరులు కలిసి మొత్తం 10,978మంది సిబ్బంది పల్స్‌పోలియో విధుల్లో పాల్గొంటున్నారని తెలిపారు. వైద్యులు, సిబ్బంది సమన్వయంతో ఉంటూ లక్ష్యాన్ని సాధించేలా కృషిచేయాలని ఆదేశించారు. పీహెచ్‌సీల వైద్యులు అందరూ ముందునుంచే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. వివిధ అంశాలపై ఆమె అవగాహన కల్పించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల వైద్యులు పాల్గొన్నారు.