పల్స్‌పోలియోను విజయవంతం చేయండి: జేసీ-2

చిత్తూరు: జనవరి 19న నిర్వహించనున్న పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జేసీ-2 వీఆర్‌ చంద్రమౌళి కోరారు. పల్స్‌పోలియో కార్యక్రమంపై సంబంధిత శాఖల అధికారులతో సోమవారం జిల్లా సచివాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. జేసీ-2 మాట్లాడుతూ.. జిల్లాలో అధికారిక అంచనాల మేరకు 4.93 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాల్సి ఉందన్నారు. 0-5 ఏళ్ల లోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలన్నారు. ఇందుకు జిల్లా వ్యాప్తంగా మూడు వేల కేంద్రాలు ఏర్పాటు చేయాలని, రైల్వే, బస్‌స్టేషన్‌లలోనూ పోలియో చుక్కలు వేయించేలా ఏర్పాట్లు చేయాలని వైద్యఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. పల్స్‌పోలియో కార్యక్రమం కోసం అంగన్‌వాడీ, ఏఎన్‌ఎంలు, నర్సింగ్‌ కళాశాలల విద్యార్థినులు, అర్బన్‌ హెల్త్‌ సిబ్బందిని వినియోగించుకోవాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు పోలియో చుక్కల కార్యక్రమ విజయవంతానికి తమవంతు సహకారం అందించాలని కోరారు. జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి హనుమంతరావు, గణాంక అధికారి రమేష్‌రెడ్డి, మునిరాజా, డెమో నిర్మల, చిత్తూరు నగరపాలక సంస్థ ఆరోగ్యాధికారి వినోద్‌కుమార్‌, పంచాయాతీ, విద్య, గ్రామీణాభివృద్ధి, ఐసీడీఎస్‌, ఆర్టీసీ, రవాణాశాఖల అధికారులు పాల్గొన్నారు.