చిరు వ్యాపారులకూ అనుమతులు ఉండాల్సిందే
● తప్పనిసరి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం
ఖమ్మం :కేంద్ర ప్రభుత్వం సామాన్యుడి నుంచి సంపన్నుడి దాకా అందరికీ నాణ్యమైన ఆహారం అందించాలన్న లక్ష్యంతో ఆహార భద్రతా, ప్రమాణాల చట్టం-2006ను తీసుకువచ్చింది. ఈ చట్టం ద్వారా మానవుడు నోటి ద్వారా తీసుకునే ప్రతి ఆహార పదార్థాన్ని, పానీయాలను, తాగునీటిని అన్ని విధాలా పరీక్షించి, అవి తినడానికి తాగడానికి అనువుగా ఉన్నాయా?లేవా? అన్నది నిర్ధారించడానికి భారత ఆహార భద్రతా, ప్రమాణాల సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ మార్కెట్‌లోకి వస్తున్న ప్రతీ ఆహార పదార్థానికి అన్నిరకాల నాణ్యతా పరీక్షలు నిర్వహించి అన్ని బాగుంటేనే వాటికి లైసెన్సు మంజూరు చేస్తుంది. లేకుంటే ఆయా ఉత్పత్తులపై నిషేధాన్ని విధిస్తుంది.
ఉమ్మడి జిల్లాలో ఆహార విక్రయదారులు: 5300 మంది
అనుమతులు తీసుకున్నవారు: 600 మంది
పెద్ద సంస్థల నుంచి చిల్లర వర్తకుల దాకా..
ఇప్పటిదాకా సంస్థ అనుమతులు పెద్ద పెద్ద తయారీ సంస్థలకు, ఉత్పత్తులకు, వ్యాపారులకే పరిమితం చేస్తూ వచ్చింది. కానీ దేశంలో ఎక్కువ మంది జనాభా తమ అవసరాలకు తగ్గ ఆహారాన్ని వీధిలో అమ్ముకునే తోపుడు బండ్ల వద్ద, కిరాణా దుకాణాల్లోనో, ఇతర చిన్న చిన్న దుకాణాల్లోనో కొంటున్నారు. అందుకే ప్రభుత్వం ఇలాంటి చోట్ల నాణ్యమైన పదార్థాలు అందుబాటులో ఉండేలా చేయాలని సంకల్పించి చిల్లర వర్తకులకు కూడా ఆహార భద్రతా అనుమతులు తప్పనిసరి చేసింది.
అనుమతులు ఎవరెవరికి?
సార్టింగ్, గ్రేడింగ్‌తో సహా తయారీ/ ప్రాసెసింగ్ సంస్థలకు, పాల సేకరణ సంస్థలు, స్లాటర్ హౌస్, సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టింగ్ యూనిట్, చమురు శుద్ధి ప్లాంట్, ప్యాకేజింగ్, గిడ్డంగులు, గోదాములు, శీతల గిడ్డంగులు, రిటైల్ వ్యాపారం, టోకు వ్యాపారం చేసే వాళ్లు, పంపిణీదారులు/ సరఫరాదారులు, ఆహారాన్ని రవాణా చేసేవారు, క్యాటరింగ్ చేసేవారు, దాబా లేదా ఇతర ఆహార పదార్థాలు విక్రయించేవారు, తోపుడు బండ్లపై వ్యాపారం చేసేవారు, క్లబ్, క్యాంటీన్, హోటళ్లు, రెస్టారెంట్లు నడిపేవారు ఆహార భద్రతా అనుమతులు తీసుకోవడం తప్పనిసరి చేసింది.
చెల్లించాల్సిన రుసుములు తక్కువే...
ప్రతిరోజు వీరు నిర్వహించే వ్యాపారానికి అనుగుణంగా రుసుమును నిర్ధారించారు. రోజుకు రూ.3వేలు అంతకన్నా తక్కువ వ్యాపారం చేస్తే రూ.100, రోజుకు రూ. 3వేల నుంచి రూ.2కోట్ల వరకు నిర్వహించేవారు రూ.2వేలు చెల్లించి లైసెన్స్‌లు పొందాలి. ఈ రుసుమును మధ్యలో ఎవరి ప్రమేయం లేకుండా ఆన్‌లైన్‌లో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవడం ద్వారా గానీ, బ్యాంకులో చలానా తీయడం ద్వారా గానీ లైసెన్సు తెచ్చుకోవచ్ఛు వీరు చెల్లించిన చలానాలను పరిశీలించి సంబంధిత శాఖ వారు వీలైనంత త్వరగా లైసెన్సులు మంజూరు చేస్తారు. ఏడాది కాలం ముగియడానికి 45 రోజుల ముందే ఈ లైసెన్సులను నవీకరణ చేసుకోవాలి. లేని పక్షంలో గడువు ముగిసిన నాటి నుంచి రోజుకు రూ.100 ఆలస్య రుసుమును చెల్లించాల్సి ఉంటుంది.
చిరు వ్యాపారులకు కలిగే ప్రయోజనాలు
చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల మీద, రోడ్డు పక్కన ఆహార పదార్థాలు అమ్ముకునే వారు కేవలం రూ.100, రూ.200 చెల్లించి సంవత్సరం పాటు ఏ అధికారి తనిఖీలు లేకుండా ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకోవచ్ఛు అధికారులు నిర్దేశించిన ప్రాంతంలో అమ్ముతున్నారా, పారిశుద్ధ్యం పాటిస్తున్నారా, నాణ్యత ఉంటుందా అన్న విషయాలను పొందుపరిచి తెచ్చుకున్న లైసెన్సు దగ్గర ఉంటే ఏ శాఖ అధికారి తనిఖీలకు వచ్చినా ధీమాగా ఉండొచ్ఛు లైసెన్సులు ఉన్న వ్యాపారస్థుల దగ్గర ఆహారం నాణ్యత ఉంటుందని కొనుగోలుదారులు సైతం కొనడానికి ఆసక్తి చూపే అవకాశం ఉంది. తద్వారా మంచి ఆదాయం లభిస్తుంది.
వ్యాపారుల్లో అవగాహన కల్పిస్తాం: కిరణ్‌కుమార్, జిల్లా గెజిటెడ్ ఆహార ఆధికారి
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఇప్పటి వరకు కేవలం 600 మందే ఈ లైసెన్సులు తీసుకున్నారు. ఇంకా తీసుకోవాల్సిన వారు వేలల్లో ఉన్నారు. లైసెన్స్ తీసుకునే విషయంపై అవగాహన లేకపోవడం వల్ల తీసుకోవడంలేదు. చిరు వ్యాపారులకు వీటిపై అవగాహన కల్పించడమే దీనికి పరిష్కారం. అందుకే వీలైనన్ని చోట్ల ఆహార భద్రతా అనుమతులపై చిరు వర్తకులకు, చిల్లర వ్యాపారులకు, వీధి వ్యాపారులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. దీనివల్ల కలిగే అదనపు ప్రయోజనాలను వారికి వివరిస్తున్నాం.