అనాథకు అండగా నిలిచి..

ఎటువంటి బంధం లేక పోయినా ఆ యువకునికి ఆమె సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. మానవత్వమే తన మతమంటూ ఓ అనాథకు కిడ్నీ దానం చేసి ఔదార్యాన్ని చాటుకున్నదీమె.


కేరళకు చెందిన 47 ఏండ్ల సీతా దిలీప్‌ ఏ బంధం లేక పోయినా ఓ అనాథ యువకునికి కిడ్నీ దానం చేసి బతికించింది. ఈ కాలంలో అయిన వాళ్లే ఆపదలో ఆదుకోలేకపోతున్నారు. అటువంటి సమాజంలో మానవత్వం పూర్తిగా నశించలేదని చెప్పడానికి సీత ఉదాహరణగా నిలుస్తున్నది. తాను సాయం చేసి ఎంతోమందికి ఆదర్శమయింది. సీత ముంబైలోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేసేది. ఆమె భర్త అబుదాబిలో పని చేసేవాడు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. 11 ఏండ్ల పాటు భార్యా, భర్తలిద్దరూ చెరొక చోట ఉద్యోగం చేశారు. తమ పిల్లల్ని బాగా చదివించుకునేందుకు ఎంతో కష్ట పడ్డారు. ఆ తర్వాత కేరళలోని సొంత గ్రామంలో స్థిరపడ్డారు. కొన్నాళ్లకు సీత దయచారిటబుల్‌ ట్రస్ట్‌లో ఉద్యోగిగా చేరింది. అప్పటికే అనాథ అయిన జయకృష్ణన్‌ అనే 19 ఏండ్ల యువకుడు మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్నాడు. గత ఐదేండ్ల నుంచి అతను డయాలసిస్‌ చేయించుకుని తన ప్రాణాలను నిలబెట్టుకుంటున్నాడు. జయకృష్ణన్‌ బతకాలంటే తప్పనిసరిగా మూత్రపిండాల మార్పిడి చికిత్స చేయాలని వైద్యులు సూచించారు.




అందుకోసం ఎవరో ఒకరు కిడ్నీ దాతలు అవసరం. కిడ్నీ దాతల కోసం దయచారిటబుల్‌ ట్రస్ట్‌ను ఆశ్రయించాడు జయకృష్ణన్‌. ఈ ట్రస్టులో ఉద్యోగిగా పని చేస్తున్న సీత అతని పరిస్థితిని గమనించింది. అతనికి తన కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఆపరేషన్‌ చేయాలంటే దాదాపు రూ.15లక్షలు అవసరం. అంత డబ్బు సమకూర్చుకునే స్థోమత జయకృష్ణన్‌కు లేదు. దీంతో సీత కుటుంబ సభ్యులందరూ కలిసి జయకృష్ణన్‌ ఆపరేషన్‌కు అవసరమైన ఆర్థిక సాయాన్ని సమకూర్చేందుకు ముందుకువచ్చారు. వారి బంధువులు, స్నేహితుల వద్ద నుంచి సేకరించి చికిత్సకు అవసరమైన మొత్తాన్ని అందించారు. అనాథ యువకునికి తన కిడ్నీ దానం చేయడమేకాకుండా చికిత్సకు అవసరమైన డబ్బునూ సమకూర్చిన సీతను అందరూ ప్రశంసిస్తున్నారు. 'అతనికి చిన్న వయసులో ఇటువంటి జబ్బు రావడం నాకు ఎంతో బాథ కలిగించింది. మానవత్వంతో జయకృష్ణన్‌ను ఆదుకోవాలనుకున్నానని' ఆమె చెబుతున్నది.