ఉదయపు నడక.. ఆరోగ్యానికి రక్ష

నిర్మల్‌: వ్యాయామం, ఉదయం నడకతో ఆరోగ్యం బాగుంటుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. గురువారం ఉదయం సారంగాపూర్‌ మండలం చించోలి(బి) గ్రామ సమీపంలోని హరితనవంలో ఎస్పీ శశిధర్‌రాజు, ఇతర అధికారులతో కలిసి ఉదయం నడక చేశారు. వనంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వివిధ పరికరాలతో వ్యాయామం చేశారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ఉదయం నడక ఎంతో మేలు చేస్తుందని, దినచర్యలో వ్యాయామాన్ని భాగంగా చేసుకోవాలని సూచించారు. ఆరోగ్యంగా ఉంటే మానసిక ప్రశాంతత ఉంటుందన్నారు. ప్రకృతి ఒడిలో ఉన్న హరితవనాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించి అక్కడున్న వసతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఆఫీసర్స్‌క్లబ్‌ ఇండోర్‌ స్టేడియంలో మనుమరాలితో కలిసి కాసేపు షటిల్‌ ఆడారు. ఆయన వెంట జిల్లా అటవీ అధికారి ఎస్‌.పి.సుథాన్‌, డీఎఫ్‌వో గోపాల్‌రావు, ఎఫ్‌ఆర్‌వో జైపాల్‌రెడ్డి, ఎఫ్‌ఎస్‌వో ఈశ్వర్‌, ఎఫ్‌బీవో శిల్ప, నాయకులు డాక్టర్‌ మల్లికార్జున్‌రెడ్డి, గణపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.