కుప్పం, డిసెంబరు 24: కుప్పంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఒక వ్యక్తి తీవ్రమైన జ్వరంతో మృతి చెందాడు.స్వైన్‌ఫ్లూతో మృతి చెందినట్లు ప్రచారం కాగా, అటువంటిదేమీ లేదని.... తీవ్రమైన జ్వరంతోపాటు షుగర్ పేషెంటు అవడంవల్లే చనిపోయాడని వైద్యాధికారులు చెబుతున్నారు. బైరెడ్డిపల్లె మండలం బాలేపల్లెకు చెందిన కందస్వామి (35) ఈనెల 21వ తేదీన కుప్పంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తీవ్ర జ్వరంతో చికిత్సకోసం చేరాడు. ఇక్కడే మంగళవారం మృతి చెందాడు.
స్వైన్‌ఫ్లూ జ్వరంవల్లే మృతి చెందాడని స్థానికంగా ప్రచారం జరిగింది. అయితే కందస్వామికి హై షుగర్‌తోపాటు న్యుమోనియా బ్రాంకెటీస్, వైరల్ జ్వరాలున్నాయని, అందువల్లే మృతి చెందాడని తమ పరిశీలనలో తేలిందని హెల్త్ ఎడ్యుకేటర్ నారాయణదాసు వివరణ ఇచ్చారు. స్వైన్‌ఫ్లూ నిర్ధారిత పరీక్షలు కుప్పంలో లేవని, ఆ వ్యాధిని నిర్ధారించాలంటే తిరుపతికి రోగి సీరమ్‌ను పంపించాల్సి ఉంటుందని చెప్పారు.