తీరిక వేళల్లో శారీరక శ్రమతో 7 రకాల క్యాన్సర్లకు కళ్లెం!

వాషింగ్టన్‌: తీరిక సమయాల్లో స్తబ్ధుగా కూర్చోకుండా శారీరక శ్రమ చేయడం ద్వారా 7 రకాల ప్రాణాంతక క్యాన్సర్ల ముప్పును తగ్గించుకోవచ్చు! 7.5 లక్షల మందిపై విస్తృత అధ్యయనం ద్వారా అమెరికాలోని నేషనల్‌ క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ పరిశోధకులు ఈ అంశాన్ని నిర్ధారించారు. శారీరక శ్రమతో పలు రకాల క్యాన్సర్ల ముప్పు తగ్గుతుందని ఇప్పటికే చాలా అధ్యయనాలు తేల్చాయి. అయితే, తీరిక సమయాల్లో చేసే శారీరక శ్రమ క్యాన్సర్ల ముప్పునకు ఎంతమేరకు కళ్లెం వేయగలదనే అంశంపై మాత్రం స్పష్టమైన గణాంకాలు అందుబాటులో లేవు. ఆ విషయంపై పరిశోధకులు తాజా అధ్యయనంలో దృష్టిసారించారు. తీరిక వేళల్లో ఖాళీగా కూర్చునేవారితో పోలిస్తే నిమిషానికి 7.5-15 రెట్లు ఎక్కువ కెలోరీలను శారీరక శ్రమ ద్వారా ఖర్చు చేయగలిగేవారిలో పెద్దపేగు, రొమ్ము, మూత్రపిండాలు, కాలేయ క్యాన్సర్ల వంటి 7 రకాల క్యాన్సర్ల ముప్పు గణనీయంగా తగ్గుతున్నట్లు గుర్తించారు. శారీరక శ్రమ పెరిగేకొద్దీ ముప్పు మరింత దిగువకు వస్తున్నట్లు తెలిపారు.