మానసిక ఆరోగ్యానికి ‘కుంగుబాటు’

ప్రతి ఏడుగురిలో ఒకరు సతమతం
  వెల్లడించిన అధ్యయనం


దిల్లీ: పలురకాల మానసిక సమస్యలతో 2017లో ప్రతి 7గురు భారతీయుల్లో ఒకరు సతమతమయ్యారు. వారిని ఇబ్బంది పెట్టిన మానసిక సమస్యల్లో అగ్రస్థానంలో కుంగుబాటు, ఆందోళన ఉన్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. ఇవికాక స్కిజోఫ్రెనియా, ఆటిజం, బైపోలార్‌ వంటి సమస్యలు వీరిని పీడించాయి. ఈ అధ్యయన వివరాలను సోమవారం ప్రకటించారు. కుంగుబాటు, ఆత్మహత్యల సంఖ్యలను విశ్లేషిస్తే ఈ రెండింటికీ మధ్య కచ్చితమైన లంకె ఉన్నట్లు వెల్లడైంది. ఈ తరహా లక్షణాలు మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే అత్యధికంగా ఉన్నట్లు  'లాన్సెట్‌ సైకియాట్రీ' పత్రికలో ప్రచురితమైన వ్యాసం పేర్కొంది.
* దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ ప్రజల మానసిక ఆరోగ్యం మెరుగుదలకు విధాననిర్ణేతలు అనుసరించాల్సిన వ్యూహాలకు, చేపట్టాల్సిన చర్యల అవసరాన్ని ఈ నివేదిక వివరాలు నొక్కి చెబుతున్నాయి.
* దేశవ్యాప్తంగా మొత్తం అనారోగ్య సమస్యల భారంలో మానసిక ఇబ్బందుల సంఖ్య విషయంలో స్పష్టమైన పెరుగుదల గోచరించింది. 1990తో పోలిస్తే 2017 నాటికి ఈ సమస్య రెట్టింపు అయింది.
* పలురకాల వైకల్యాలతో జీవించిన సంవత్సరాల(వైఎల్‌డీ) విషయానికి వస్తే అందులో మానసిక సమస్యల వాటా 14.5 శాతంగా ఉంది.
* కుంగుబాటు, ఆందోళన సమస్యలున్న వారు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కువ. పురుషులతో పోలిస్తే మహిళలే సంఖ్యే అధికంగా ఉంది.
* వయోవృద్ధుల్లో కుంగుబాటు పెరుగుదల అనేది భారత్‌లో వృద్ధాప్యం దిశగా అడుగులేస్తున్న జనాభాపై చెప్పుకోదగిన సమస్యలకు దారి తీయవచ్చు.


2017లో ....
పలు మానసిక సమస్యలతో బాధపడిన భారతీయుల సంఖ్య: 19.7 కోట్లు.
కుంగుబాటు నెదుర్కొన్న వారు: 4.6 కోట్లు.
ఆందోళన సమస్యలున్న వారు: 4.5 కోట్లు