పాలకొండ: చక్కనైనా ఉద్యోగం.. ఆర్థిక ఇబ్బందులు లేవు. కానీ స్టాఫ్ నర్సుగా విధులు నిర్వహిస్తున్న ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. విధులు నిర్వహిస్తున్న ఆస్పత్రిలో ఉరి వేసుకొని బలవన్మరణా నికి పాల్పడింది. ఈ ఘటన పాలకొండ ఏరియా ఆస్పత్రిలో గురువారం మధ్యాహ్నం జరిగింది. రాజాంలోని లచ్చయ్యపేట కాలనీకి చెందిన కాకర్ల హేమలత (36) గత మూడేళ్లుగా ఏరియా ఆస్పత్రిలో స్టాఫ్‌నర్సుగా విధులు నిర్వహిస్తోంది. గురువారం విధులకు హాజరైంది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో డ్యూటీ రూమ్‌కు వెళ్లింది. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో తోటి సిబ్బంది వచ్చి చూసేసరికి ఆత్మహత్య చేసుకొని కనిపించింది. కిటికీకి చున్నీ కట్టి ఉరివేసుకుంది.
వెంటనే సిబ్బంది వైద్యాధికారులకు సమాచారమందించారు. డ్యూటీ డాక్టర్ డి.వి.శ్రీనివాస్, సూపరింటిండెంట్ జె.రవీంద్రకుమార్‌లు ఆమె మృతి చెందినట్టు నిర్ధారించి కుటుంబసభ్యులకు సమాచారమందించారు. మృతురాలి తల్లిదండ్రులు సూర్యారావు, సరస్వతిలు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. మృతదేహాం చూసి కన్నీరుమున్నీరయ్యారు.. ఎస్‌ఐ బాలరాజు ఘటనాస్థలానికి చేరుకున్నారు. నా చావుకు ఎవరూ కారణం కాదంటూ మృతురాలు రాసిన సూసైడ్ నోట్ లభ్యమైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ బాలరాజు తెలిపారు.