సర్కార్‌ దవాఖానలకు కార్పొరేట్‌ కళ

 అధునాతన సౌకర్యాలు కల్పించిన ప్రభుత్వం
- అదనపు భవనాల నిర్మాణంతో పెరిగిన బెడ్ల సంఖ్య

హైదరాబాద్‌: ప్రభుత్వ దవాఖానలు అధునాతన సౌకర్యాలతో కొత్తకళను సంతరించుకున్నాయి. హైదరాబాద్‌తోపాటు, రాష్ట్రవ్యాప్తంగా బోధనా దవాఖానలు, జిల్లాస్థాయి, ఏరియా దవాఖానలు, కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఆధునిక హంగులు సంతరించుకొన్నాయి. దవాఖానలకు వచ్చే రోగులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతోపాటు, అత్యవసర వైద్యసేవల విస్తరణలోనూ ప్రత్యేక దృష్టి సారించింది. వార్డులు, ఓపీ విభాగాలను సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు అత్యవసర వైద్యసేవలు అందించే ఐసీయూలను మెరుగుపర్చి.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నది. అన్ని జిల్లా దవాఖానల్లో నవజాత శిశువుల సంరక్షణకోసం ప్రత్యేక యూనిట్లు ఏర్పాటుచేసింది. నిలోఫర్‌లో ఏర్పాటుచేసిన ఇంటెన్సివ్‌కేర్‌ బ్లాక్‌లో దేశంలోనే ముఖ్యమైన అన్ని వసతులను కల్పించారు. చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వైద్య, ఆరోగ్యశాఖ ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 22 ఎస్‌ఎన్‌సీయూలు (సిక్‌న్యూబర్న్‌ కేర్‌ యూనిట్లు), 61ఎన్‌బీఎస్‌యూ, 562 ఎన్‌బీసీసీలను ఏర్పాటుచేసింది. మరో 6 ఎస్‌ఎన్‌సీయూల నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎస్‌ఎన్‌సీయూల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఎఫ్‌బీఎన్‌సీ శిక్షణ అందించి అంతర్జాతీయ ప్రమాణాలతో చిన్నారులకు వైద్యం, వైద్యశాలల్లో వసతులు కల్పించారు.


అందుబాటులోకి 2,690 బెడ్లు


తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పలు సర్కారు దవాఖానల్లో అదనపు భవనాల నిర్మాణం చేపట్టారు. రాష్ట్రంలో రూ.372.47కోట్లతో విస్తరణ/ అదనపు భవనాలను నిర్మించి కొత్తగా 2,690 బెడ్లను అందుబాటులోకి తెచ్చారు. అందులో.. తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌ ద్వారా రూ.129.35 కోట్లు వెచ్చించి 14 దవాఖానల్లో భవనాల విస్తరణ చేపట్టడంతో 720 బెడ్లు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏడు దవాఖానల్లో రూ.127.50 కోట్లు ఖర్చుచేసి 1050 బెడ్ల సామర్థ్యంతో మాతాశిశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటుచేశారు. నాబార్డు నిధులతో ఆరు దవాఖానల్లో 470 బెడ్లను అదనంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభు త్వం రూ.61.56 కోట్లు వెచ్చించింది. నిలోఫర్‌ దవాఖానకు వస్తున్న రోగుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా మెటర్నిటీ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. 450 బెడ్ల సామర్థ్యంతో రూ.54.06 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ అదనపు భవనంలో నవజాత శిశువులకు ప్రత్యేక వైద్యసేవలు అందిస్తున్నారు.
Nizamabad-Hospital1