దేశంలో ప్రతి ఏడుగురిలో ఒకరికి మానసిక సమస్యలు
- దక్షిణాదిలోనే అధికం.. తెలంగాణది ప్రథమస్థానం
- పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువ
- బాధితుల్లో అత్యధికులు 35-45 ఏండ్లవారే
- ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రిసెర్చ్ అధ్యయనంలో వెల్లడి
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దేశంలో మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారి సంఖ్య పెరుగుతున్నది. దేశంలో ప్రతి ఏడుగురిలో ఒకరు ఈ సమస్యలతో బాధపడుతుండగా.. వీరిలో దక్షిణ భారతీయులే అధికంగా ఉన్నట్టు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రిసెర్చ్ అధ్యయనంలో వెల్లడయింది. డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలతో బాధపడుతున్నవారిలో తెలంగాణ మొదటిస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కేరళ, గోవా ఉన్నాయి. వివిధ మానసిక రుగ్మతలపై అధ్యయనంచేసిన ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఆ వివరాలను లాన్సెట్ జర్నల్‌లో ప్రచురించింది. పురుషులతో పోల్చుకుంటే మహిళల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. 2ః1 నిష్పత్తిలో మహిళలు, పురుషులు ఈ రుగ్మతలతో బాధపడతున్నారు. హార్మోన్ల అసమతుల్యత, కుటుంబ ఒత్తిడి, పని భారం వంటివి దీనికి కారణమవుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. తెలంగాణలో 35 - 45 ఏండ్ల మధ్య వయసువారే డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక రుగ్మతలతో బాధపడుతున్నట్టు అధ్యయనంలో తేలింది. ఈ రుగ్మతలపై 1990 నుంచి 2017 వరకు డేటాను వైద్యులు అధ్యయనం చేశారు.
4.6 కోట్ల మందికి మానసిక సమస్యలు
దేశవ్యాప్తంగా నమోదవుతున్న మానసిక ఆరోగ్య సమస్యల కేసుల్లో 33.8 శాతం మంది డిప్రెషన్‌తో, 19 శాతం మంది ఆందోళనతో బాధపడుతున్నారు. మొత్తంగా దేశంలో 46 మిలియన్ల (4.6 కోట్ల) మంది డిప్రెషన్, ఆందోళనలకు గురవుతున్నారని సర్వేలో తేలింది. ఇతర రాష్ర్టాలతో పోలిస్తే దక్షిణాది రాష్ర్టాల్లో 1.9 శాతం ఎక్కువగా మానసిక రుగ్మతల బారిన పడుతున్నారు. డిప్రెషన్, ఆందోళనతోపాటు బైపోలార్ డిసార్డర్, అటెన్షన్ డెఫిషెన్సీ సిండ్రోమ్, ఈటింగ్ డిజార్డర్ వంటివి కూడా ప్రబలంగా ఉన్నాయని వైద్యులు చెప్తున్నారు. 1990వ సంవత్సరంతో పోలిస్తే 2017 నాటికి మానసిక సమస్యలతో బాధపడుతున్నవారి సంఖ్య రెట్టింపైనట్టు సర్వేలో వెల్లడైంది. 2017నాటికి దేశవ్యాప్తంగా 197.3 మిలియన్ల (19.73 కోట్ల) మంది పలు రకాల మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్టు తేలింది. ఇలాంటివారు ఎప్పటికప్పుడు మనోవైద్యులను సంప్రదిస్తూ చికిత్స పొందాలని నిపుణులు సూచిస్తున్నారు. కాగా దేశంలో మానసిక ఆరోగ్య వైద్య నిపుణుల కొరత ఉన్నది. లక్ష మంది జనాభాకు కేవలం 0.3 మంది మనోవైద్యులు మాత్రమే అందుబాటులో ఉన్నారు.
సైకలాజికల్ ఫస్ట్‌ఎయిడ్ ముఖ్యం
డిప్రెషన్‌కు గురైనవారిలో నిస్సహాయత, నిరాశవాదం ఎక్కువగా కన్పిస్తుంది. మానసికంగా కుంగిపోతుంటారు. ఆత్మన్యూనతా భావానికి గురవుతారు. ఉత్సాహంగా ఉండరు. ఉద్యోగంపై దృష్టిసారించలేరు. ఒంటరిగా ఉంటారు. వృత్తిపరంగా స్థిరత్వం లేకపోవడం, వైవాహిక జీవితంలోని సమస్యలు ఎక్కువ మందిలో డిప్రెషన్‌కు కారణమవుతున్నాయి. ఇలాంటివారికి సైకలాజికల్ ఫస్ట్ ఎయిడ్ అందించడం ముఖ్యం. మానవ సంబంధాలను మెరుగుపరుచుకోవాలి. డిప్రెషన్, ఆందోళనపై జాగ్రత్త వహించకపోతే ఆత్మహత్యకు దారితీసే ప్రమాదం ఉంటుంది.
- డాక్టర్ చల్లా గీత, సైకాలజిస్ ్ట(మనో జాగృతి ఫౌండర్)