ఫార్మా కంపెనీలో ప్రమాదం

పరవాడ: మండల పరిధిలో గల ఫార్మాసిటీలోని విజయశ్రీ ఆర్గానిక్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీలో ప్రమాదం సంభవించింది. ట్రైపోసిగ్న్‌ గ్యాస్‌ బయటకు రావడంతో అస్వస్థతకు గురై ప్రొడక్షన్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సీహెచ్‌.శ్రీధర్‌ (34) మృతిచెందారు. కెమిస్ట్‌ బి.చంద్రమోహన్‌ (37), షిప్టు ఇన్‌చార్జి పైలా అప్పారావు (32) ఆస్పత్రి పాలయ్యారు. ఈ ప్రమాదం బుధవారం సాయంత్రం చోటుచేసుకోగా గురువారం ఉదయం వెలుగుచూసింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కంపెనీలోని ప్రొడక్షన్‌ బ్లాక్‌ వద్ద ఆపరేటర్‌ శ్రీధర్‌ పర్యవేక్షణలో కెమికల్‌ ప్రాసెసింగ్‌ జరుగుతుంది. సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో రియాక్టర్‌ నుంచి ట్రైపోసిగ్న్‌ గ్యాస్‌ బయటకు రావడంతో శ్రీధర్‌తో పాటు అక్కడ పనిచేస్తున్న కెమిస్టు చంద్రమోహన్‌, షిప్టు ఇన్‌చార్జి పైలా అప్పారావు, హెల్పర్‌ సురేశ్‌, కాంట్రాక్టు కార్మికుడు నవీన్‌లు ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకున్నారు.

 

వెంటనే ఐదుగురిని కంపెనీకి చెందిన అంబులెన్స్‌లో రాంకీ క్లీనిక్‌కు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స నిర్వహించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం గాజువాకలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రొడక్షన్‌ ఆపరేటర్‌ శ్రీధర్‌ గురువారం సాయంత్రం మృతిచెందాడు. చంద్రమోహన్‌, అప్పారావుల పరిస్థితి విషమంగా ఉంది. ఇదే ప్రమాదంలో చిక్కుకున్న నవీన్‌, సురేశ్‌ ప్రాణాలతో బయటపడ్డారు. మృతిచెందిన శ్రీధర్‌ విశాఖపట్నం రెల్లి వీధికి చెందినవాడు. మృతునికి భార్య దేవి ఉన్నారు. ఏడాది క్రితమే వివాహం జరిగింది. ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న చంద్రమోహన్‌ శ్రీకాకుళం జిల్లా బారువా మండలానికి చెందినవాడు. అప్పారావు సబ్బవరం మండలం మల్లునాయుడుపాలెం గ్రామానికి చెందినవాడు.