అచ్చంపేట : ప్రభుత్వాసుపత్రి వైద్యులు ప్రసవ సమయంలో శిశువు తల, మొండెం వేరు చేసిన ఘటనను లోతుగా విచారించాలని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగా శిశువు తలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించింది. మరోవైపు ఈ ఘటనలో తనకు ఎలాంటి ప్రమేయం లేదని, సీనియర్లు తనను బలి చేశారని ఆరోపిస్తూ వైద్యురాలు సుధారాణి సోమవారం ఆందోళనకు దిగడం చర్చనీయాంశమైంది.
నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో ఈ నెల 18న ఘటన జరగగా, బాధ్యులైన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.తారాసింగ్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మరో వైద్యురాలు సుధారాణిని విధుల నుంచి తొలగించింది. శిశువు నుంచి వేరైన తలను త్రిసభ్య కమిటీ సభ్యులు ఇప్పటికే పరిశీలించారు. పోస్టుమార్టం నిర్వహించి ఆస్పత్రిలో భద్రపరిచారు. తల భాగాన్ని సోమవారం హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. వైద్యులు భద్రపరిచిన తల శిశువుదేనా? వివాదం తలెత్తిన నేపథ్యంలో మరోదాన్ని అక్కడపెట్టారా? అనేది తేల్చేందుకు ఫోరెన్సిక్ నివేదిక కోరినట్టు సమాచారం.
ఆ ఘటనలో ప్రమేయం లేకున్నా అధికారులు తనపై చర్యలు తీసుకున్నారని వైద్యురాలు సుధారాణి ఆరోపించారు. సోమవారం ఆమె తల్లిదండ్రులతో కలిసి అచ్చంపేట ప్రభుత్వాసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. 'బాధిత మహిళ స్వాతి ఆసుపత్రికి వచ్చిన రోజు ఓపీలో ఉన్నా. ఆమెకు ప్రసవం చేస్తున్న విషయమే తెలియదు. సూపరింటెండెంట్ తారాసింగ్, మరో వైద్యుడు సిరాజ్ ప్రసవం చేసేందుకు ప్రయత్నించారు. తల, మొండెం వేరైన విషయాన్నీ వాళ్లు చెప్పలేదు. డ్యూటీ వైద్యురాలైన నాకు చెప్పకుండానే సిరాజ్ పెద్దాస్పత్రికి రెఫర్ చేశారు.బాధిత కుటుంబానికి సమాధానం చెప్పాలంటూ సూపరింటెండెంట్ సూచించడంతో వారికి సంజాయిషీ ఇచ్చా. తప్పును కప్పిపుచ్చుకునేందుకు సీనియర్లు నన్ను బలి పశువును చేశారు'' అని ఆమె పేర్కొన్నారు.