చార్మినార్(హైదరాబాద్) : పేట్లబుర్జు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి(జజ్జిఖానా)లో చికిత్స పొందుతున్న స్వాతి(24) కోలుకోవటంతో ఆస్పత్రి అధికారులు డిశ్చార్జి చేసి అచ్చంపేట మండలంలోని ఆమె స్వగ్రామం నడింపల్లికి పంపించారు. నడింపల్లికి చెందిన సాయిబాబు భార్య స్వాతికి ఈనెల 18న కాన్పు కోసం అచ్చంపేట ఆస్పత్రికి రాగా వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి శిశువు మొండెం, తలను వేరుచేయటం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. అచ్చంపేట వైద్యులు శిశువు తల వేరుచేసిన విషయం తెలపకుండానే హైదరాబాద్‌కు వెళ్లాలని సూచించటంతో అదేరోజు కుటుంబ సభ్యులు స్వాతిని పేట్లబుర్జు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఇక్కడి వైద్యులు శస్త్రచికిత్స చేయగా శిరస్సు లేని శిశువు బయటపడటంతో జరిగిన ఘోరం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇద్దరు వైద్యులపై ఇప్పటికే వేటువేశారు. డిశ్చార్జి సందర్భంగా స్వాతి విలేకరులతో మాట్లాడారు. అచ్చంపేట వైద్యుల నిర్లక్ష్యంతోనే తాను బిడ్డను కోల్పోయానని వాపోయారు. ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు. పేట్లబుర్జు ఆస్పత్రి వైద్యులు చికిత్సలు అందించి తన కోడలు స్వాతి ప్రాణాలు కాపాడారని అత్త చంద్రమ్మ పేర్కొన్నారు. తమలాంటి పరిస్థితి మరేవరికి రాకూడదన్నారు.