ఫస్ట్‌ ఎయిడ్‌తో ప్రాణరక్షణ



  • వాహనాలు, కార్యాలయాలు, పాఠశాలల్లో కనిపించని బాక్సులు

  • అందుబాటులో ఉంచాలని వైద్యుల సూచన



వాంకిడి, డిసెంబరు 25: అత్యవసర సమయంలో వైద్యులు అందుబాటులో లేనప్పుడు ప్రథమ చికిత్స అత్యంత కీలకం. ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌ (ప్రథమ చికిత్స పెట్టె) ఉపయోగం చాలా మందికి తెలియకపోవడంతో ప్రాణాలు పోగొట్టుకొంటున్నారు. పాఠశాలలు, వాహనాల్లో ప్రథమ చికిత్స బాక్సులను ఏర్పాటు చేయడం ద్వార ప్రమాద సమయాల్లో కొందరినైనా రక్షించవచ్చు. ఆరోగ్యమును పరిరక్షించడానికి, చిన్న చిన్న గాయాలకు, సాధారణ శరీర రుగ్మతలకు తాత్కాలికంగా అందించే వైద్యాన్ని ప్రథమ చికిత్స అంటారు. వైద్యంలో శిక్షణ పొందిన వారు, శిక్షణ లేని వారు కూడా ప్రథమ చికిత్సలు చేయవచ్చు. ప్రాణాపాయంలో ఉన్న వారిని కాపాడడానికి ప్రథమ చికిత్స ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి.


ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగితే వెంటనే అత్యవసర సహాయం కోసం 108కు ఫోన్‌ చేయాలి. సిబ్బంది వచ్చేలోగా రక్తస్రావాన్ని అదుపు చేయాలి. ఇందుకోసం గాయంపై గుడ్డతో బలంగా అదిమిు ఉంచాలి. చిన్నగాయాలైతే కొద్దిసేపటికి రక్తస్రావం ఆగిపోతుంది. చికిత్స చేసే ముందు గ్లౌజ్‌లు ఉంటే చేతికి ధరించాలి. గాయంపై మట్టి, మురికి పోయేందుకు శుభ్రమైన నీటితో కడిగి యాంటిసెప్టిక్‌ లోషన్‌ వేసి గుడ్డతో కట్టాలి. ఎక్కువ రక్తస్రావం అయ్యే గాయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నీటితో కడగరాదు. విష పురుగులు, పాముకాటుకు గురైతే వెంటనే కాటువేసిన పైభాగంలో గుడ్డతో గట్టిగా బిగించి కట్టాలి. వేడి నీరసోఫ్‌తో ఆ భాగాన్ని శుభ్రంగా కడిగి యాంటిబయాటిక్‌ క్రీమ్‌ రాయాలి. ఆలస్యం చేయకుండా అసుపత్రికి తరలించాలి.

 

ప్రథమ చికిత్స పెట్టెలో ఉండాల్సినవి

క్షతగాత్రులకు తక్షణ వైద్యాన్ని అందించేందుకు ప్రథమ చికిత్స పెట్టెను పాఠశాలల్లో, వాహనాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసుకోవాలి. బాక్స్‌లో వివిధ రకాల సైజుల్లో అతుక్కునే బ్యాండేజీలు, నూలు బ్యాండేజీ లేదా రకరకాల సైజుల్లో ఉన్న నూలు గాజ్‌ప్యాడ్లు ఉంచాలి. అతుక్కునే పట్టీలు, త్రికోణపు బ్యాండేజీ చుట్ట, దూది చుట్ట, ప్లాస్టర్లు, కత్తెర, పెన్నుసైజు టార్చిలైటు, చేతులకు వేసుకునే గ్లౌజులు, ట్వీజర్స్‌ (పట్టుకర్ర) సూది, తువ్వాలు, పొడి వస్త్రపు ముక్కలు, యాంటీ సెప్టిక్‌ డెట్టాల్‌, పలు రకాల ఔషదాలను బాక్స్‌లో పెట్టాలి.

 

ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సులు అందుబాటులో ఉంచాలి

-అప్సాన, వైద్యాధికారిణి

ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సులు పాఠశాలల్లో, కార్యాలయాల్లో, వాహనాల్లో అందుబాటులో ఉంచుకోవాలి. ప్రమాదాలు జరిగినప్పుడు, అత్యవసర సమయంలో ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సులు ఎంతో ఉపయోగ పడతాయి. ప్రమాదం జరిగినప్పడు వైద్యుల వద్దకు క్షతగాత్రులను తరలించే వరకు తక్షణమే ప్రాణాపాయం నుంచి కాపాడెందుకు ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సులతో ప్రథమ చికిత్సలు చేసిప్రాణాలు కాపాడుకోవచ్చు.