బ్యాటరీ అవసరంలేని బయోసెన్సర్
శరీరంలోనే అమరిక
ఎప్పటికప్పుడు గ్లూకోజ్ స్థాయి తెలుసుకోవచ్చు
చెన్నై: మధుమేహ బాధితులకు ఊరట. ఎప్పటికప్పుడు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని గుర్తించేందుకు బ్యాటరీలు అవసరం లేకుండా, స్వయంశక్తితో పనిచేసే ఎలక్ట్రానిక్ బయోసెన్సర్‌ను పరిశోధకులు కనుగొన్నారు. ఈ కొత్త సెన్సర్‌తో తరచూ రక్తం నమూనాలు సేకరించి పరీక్షించే విధానానికి స్వస్తి పలకొచ్చు. ఇది ప్రజలకు అందుబాటులోకి రావాల్సి ఉంది. బ్యాటరీ ఛార్జింగ్ అవసరం లేకుండా శరీరంలో అమర్చే వీలున్న ఇలాంటి పరికరాన్ని రూపొందించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. సౌదీ అరేబియాలోని కింగ్ అబ్దుల్లా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాల జీకి(కేఏయూఎస్‌టీ) చెందిన పరిశోధకులు ఈ ఘనత సాధించారు. ఈ పరిశోధనల్లో తమిళనాడులోని కారైకుడిలో ఉన్న సెంట్రల్ ఎలక్ట్రో కెమికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఈసీఆర్‌ఐ)కి చెందిన తమిళరసన్ పళనిస్వామి అనే శాస్త్రవేత్త కూడా పాలుపంచుకున్నారు. ప్రస్తుతం మార్కె ట్లో మధుమేహాన్ని పరీక్షించే పరికరాలు బ్యాటరీ, ఛార్జింగ్ ద్వారా మాత్రమే పనిచేస్తున్నాయి. కొత్త సెన్సర్ స్వయంశక్తితో పనిచేస్తుంది. ఈ బయోసెన్సర్ జీవక్రియలో తలెత్తే అసాధారణ పరిస్థితులను త్వరగా, కచ్చితమైన సమాచారంతో ముందుగానే గుర్తిస్తుందని కేఏయూఎస్‌టీ పరిశోధక విద్యార్థి డేవిడ్ ఓహయాన్ తెలిపారు. మధుమేహం సహా అనేక వ్యాధులను పర్యవేక్షించడానికి, నియంత్రించడానికి, నయం చేయడానికి బయోసెన్సర్లు ఉపకరిస్తాయని చెప్పారు.
ఎలా పనిచేస్తుందంటే..?
స్వయంశక్తి కలిగిన ఈ బయోసెన్సర్‌లో ఉన్న పాలిమర్... శరీరంలోని గ్లూకోజ్ ఆక్సిడేజ్ అనే ఎంజైమ్‌తో కలిసి గ్లూకోజ్‌తో రసాయనిక చర్య జరుపుతుంది. దీనివల్ల 2 నుంచి 3 మైక్రోవాట్ల విద్యుదుత్పత్తి అవుతుంది. ఈ విద్యుత్ సదరు సెన్సార్ పనిచేయడానికి సరిపోతుందని తమిళరసన్ తెలిపారు. ఈ సెన్సర్ ద్వారా రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం సాధ్యమవుతుందన్నారు. సెన్సర్‌ను శరీరంలోనే ఉంచడం వల్ల మధుమేహ దుష్ప్రభావాలు తలెత్తకుండా ముందుగానే జాగ్రత్త పడొచ్చని తెలిపారు.