న్యూయార్క్: వైరస్‌ల ఉనికిని వేగంగా గుర్తించడం ద్వారా ఆరోగ్య సంరక్షణలో దోహదపడగల సరికొత్త పరికరాన్ని అమెరికా శాస్త్రవేత్తలు తాజాగా అభివృద్ధి చేశారు. 'విరియాన్'గా పిలిచే ఈ చిన్న పరికరం చేతితో పట్టుకునేందుకు వీలుగా ఉంటుంది. అందులోని నానోట్యూబులు పరిమాణం ఆధారంగా వైరస్‌ల ఉనికిని కనిపెడతాయి. అనంతరం రామన్ వర్ణపట మాపనాన్ని (స్పెక్ట్రోస్కోపీ) ఉపయోగిస్తూ వ్యక్తిగత కంపనాలను బట్టి వైరస్ రకాలను గుర్తించవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న విధానాల్లో వైరస్‌ల గుర్తింపునకు రోజుల తరబడి సమయం అవసరమవుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. విరియాన్‌తో ఈ పనిని కేవలం నిమిషాల వ్యవధిలో, తక్కువ ఖర్చుతో పూర్తి చేయొచ్చని పేర్కొన్నారు. వైరస్‌లు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ వాటి జాడను అది గుర్తించగలదని చెప్పారు. పరిమాణం తక్కువగా ఉండటంతో మారుమూల ప్రాంతాలకూ విరియాన్‌ను తీసుకెళ్లడం వీలవుతుందని వెల్లడించారు.