సామాజిక వైద్యుడు!

యువ' కార్యక్రమంతో విద్యార్థులకు అవగాహన

 సైనికుల కుటుంబాలకు50 శాతం సబ్సిడీపై చికిత్స

హెచ్‌ఐవీ బాధితులకు ప్రతి నెలా మందులు అందజేత





గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు




డాక్టర్‌ చక్రపాణి సేవానిరతి

 

సంగారెడ్డి, డిసెంబరు 24: వృత్తిరీత్యా ఆయనో వైద్యుడు. స్వయంగా ఆస్పత్రిని నడుపుతున్నారు. నిత్యం వృత్తిలో ఎంత బిజీగా ఉన్నా.. సామాజిక బాధ్యతను మాత్రం మరువరు. సంగారెడ్డిలో గాయత్రీ చిల్డ్రన్స్‌ నర్సింగ్‌హోం నిర్వహిస్తున్న డాక్టర్‌ చక్రపాణి సమాజం కోసం తనవుంతుగా సేవ చేస్తుంటారు. విద్యాసంస్థలో బాలబాలికలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం 'యువ' కార్యక్రమం చేపట్టింది. జిల్లా బాలల పరిరక్షణ విభాగం, మహిళా శిశు సంక్షేమ శాఖ, తెలంగాణ పీడీయాట్రిక్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ బాధ్యతలు తీసుకోవడానికి జిల్లాలో ఏ డాక్టర్‌ ముందుకు రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్‌ చక్రపాణి కార్యక్రమ నిర్వహణకు అంగీకరించారు. ఇదో సామాజిక బాధ్యతగా ఆయన భావించి సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట జిల్లాలలో కళాశాలలు, పాఠశాలల్లో చదివే కిషోర బాలబాలికలకు 'యువ' కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.

 

22 అంశాలపై అవగాహన

యువ కార్యక్రమంలో భాగంగా కిషోర బాలబాలికలకు 22 అంశాలపై దృశ్యమాలిక ద్వారా అవగాహన కల్పిస్తారు. వీటితో శారీరక అభివృద్ధి, పోషకాహారం, పరిశుభ్రత, వ్యాయామం, మంచి స్పర్శ, చెడు స్పర్శ, లింగబేధం, బంధుత్వాలు, అతి కోపం, కోపంపై నియంత్రణ, మానసిక ఆరోగ్యం, తట్టుకునే నైపుణ్యం, ఒత్తిడి నియంత్రణ, ఆన్‌లైన్‌ వేధింపులు, వివాహానికి సంసిద్ధత, వైవాహిక జీవితాన్ని అర్థం చేసుకోవడం, తల్లిదండ్రుల బాధ్యత, లైంగిక ప్రవర్తన, బాలల న్యాయచట్టం-2015, బాలలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం-2012, భవిష్యత్తు ఆలోచన, మొబైల్‌, ఇంటర్నెట్‌, సోషల్‌ మీడియా వాడడం తదితర అంశాలను వివరాస్తారు.

 

గ్రామాల్లో వైద్య శిబిరాలు

తన స్నేహితుడు, ఉపాధ్యాయుడు మల్లిఖార్జున్‌గౌడ్‌ కోరిక మేరకు అందోలు మండలం మన్‌సాన్‌పల్లి గ్రామాన్ని డాక్టర్‌ చక్రపాణి దత్తత తీసుకున్నారు. ఇతర వైద్యుల సహకారంతో ఈ గ్రామంలో తరచుగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. వివిధ మెడికల్‌ కంపెనీలు ఇచ్చే శాంపిల్స్‌తో పాటు అవసరమైన ఇతర మందులను స్వయంగా కొనుగోలు చేసి ప్రజలకు అందజేస్తున్నారు. దీంతోపాటు టేక్మాల్‌ మండలం కుసంగి, మండల కేంద్రమైన వట్‌పల్లి తదితర గ్రామాల్లోనూ వైద్య శిబిరాలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు.

 

సేవా కార్యక్రమాలెన్నో..

డాక్టర్‌ చక్రపాణి ఎన్నో సేవా కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారు. తన దత్తత గ్రామం మాసాన్‌పల్లి గ్రామంలో నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఆయన సొంత ఖర్చులతో బహుమతులు అందజేశారు. గ్రామంలో చెత్త కుండీలను ఏర్పాటు చేయించారు. మిషనరీస్‌ ఆఫ్‌ మెర్జీ సంస్థతో కలిసి జిల్లాలో హెచ్‌ఐవీ బాధితులకు ప్రతి నెలా మందులు, పోషకాహారం అందజేస్తున్నారు. వారికి ఆస్పత్రి తరఫున గుర్తింపు కార్డు అందజేసి ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తున్నారు. దేశం కోసం పోరాడే జవాన్ల పిల్లలకు తమ ఆస్పత్రిలో యాభై శాతం సబ్సిడీతో వైద్యం అందజేస్తున్నారు. సంగారెడ్డిలో ఇటీవలే నిర్వహించిన కరాటే పోటీలను ప్రోత్సహించడానికి సాయం అందజేశారు.