మహబూబ్‌నగర్: పాలమూరు తండాల్లో మహిళలకు అకారణంగా గర్భసంచులను తొలగిస్తున్న వైనంపై వనపర్తి జిల్లా కలెక్టరు శ్వేతామహంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి బుధవారం సాయంత్రంలోపు నివేదికను అందించాలని జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాస్‌ను ఆమె ఆదేశించారు. ' మంగళవారం జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాస్ ఖిల్లాగణపురం సామాజిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి అజయ్‌కుమార్, జిల్లా ప్రజారోగ్య అధికారి రవిశంకర్, స్థానిక ఆశా, ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ దారుణానికి పాల్పడుతున్న స్థానిక ఆర్‌ఎంపీ, ప్రైవేటు వైద్యుల గురించి కూపీ లాగారు. బుధవారం తండాలకు వెళ్లి విచారణ జరుపుతామని డీఎంహెచ్‌వో డా. శ్రీనివాస్ 'ఈనాడు'కు తెలిపారు. అధికారులు విచారణకు వస్తున్నారని తెలుసుకున్న పలువురు ఆర్‌ఎంపీలు మంగళవారం ఆస్పత్రులకు తాళాలు వేసి పరారయ్యారు.