సిద్దిపేట : విష పురుగులు పాఠశాల గదుల్లోకి రాకుండా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్‌ఛార్జి వైద్యాధికారి మనోహర్ పాఠశాల ఉపాధ్యాయులకు సూచించారు. సిద్దిపేట గ్రామీణ మండలం చిన్నగుండవెల్లి (నారాయణరావుపేట) మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు. విష పురుగుల బారిన పడి అనారోగ్యం పాలైన 46 మంది విద్యార్థులను వైద్యులు పరీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విషపురుగులు తిరుగుతున్నందున విద్యార్థులు శరీరం నిండుగా దుస్తులు ధరించాలని సూచించారు. చలితీవ్రత అధికంగా ఉన్నందున చర్మం పొడి బారుతున్నందున చర్మ లేపనాలు (వ్యాజిలెన్) వాడాలన్నారు. గజ్జి, తామర అంటు వ్యాధులు రాకుండా తగు చర్యలు తీసుకోవాలని పాఠశాల, వైద్య సిబ్బందికి సూచించారు. పాఠశాల గదుల కిటికీలు, ద్వారాలు సరిచేసి పురుగులు రాకుండా చూడాలని, విద్యార్థులు పడుకునే గంట ముందు విద్యుత్తు దీపాలు అర్పివేయాలని పాఠశాల ప్రిన్సిపల్ మహబూబ్‌కు సూచించారు. కార్యక్రమంలో వైద్యులు కాశీనాథ్, మోహన్ కృష్ణారెడ్డి, పాఠశాల సిబ్బంది ఉన్నారు.