పల్లెల శుభ్రతతో ఆరోగ్య తెలంగాణ

రెబ్బెన : ప్రతి పల్లె పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, ముఖ్యమంత్రి ఆలోచన విధానాన్ని అమలు చేయడంలో ప్రజలను భాగస్వాములు చేయాలని జడ్పీ ఛైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి అన్నారు. మంగళవారం రెబ్బెన, గోలేటి, నంబాల, గంగాపూర్‌, పాసిగాం, లక్ష్మీపూర్‌, మాద్వాయిగూడ గ్రామ పంచాయతీలకు ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కుమార్‌, ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి ట్రాక్టర్లను ఆమె పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జడ్పీ ఛైర్‌పర్సన్‌ మాట్లాడుతూ.. గ్రామాలు పరిశుభ్రతతో ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు పంపిణీ చేస్తోందన్నారు. 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక పకడ్బందీగా నిర్వహించడానికి ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్‌తో పాటు ట్రాలీ, ట్యాంకరు పంపిణీకి శ్రీకారం చుట్టిందన్నారు. పార్టీలకు అతీతంగా సర్పంచులు, ఉపసర్పంచులు సమన్వయంతో పని చేయాలని, గ్రామసభలో బడ్జెట్‌పై చర్చించుకొని అభివృద్ధికి దోహదపడాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి అధికారులను నియమించామని, ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. భాజపా ప్రభుత్వం రైల్వే బడ్జెట్‌ విషయంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తుందని విమర్శించారు. కనీసం ప్లైఓవర్‌ వంతెన నిర్మించడంతో భాజపా ఎంపీ చొరవ చూపాలని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ పురాణం సతీష్‌ కుమార్‌, ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ 30 రోజుల ప్రణాళికలో జరిగిన పనులతో కుమురం భీం జిల్లాలో మరణాల సంఖ్య తగ్గినట్లు తెలిపారు. వచ్చే నెల 2 నుంచి మళ్లీ గ్రామ ప్రణాళిక ప్రారంభమవుతుందన్నారు. ఆర్థిక వనరులను గ్రామ స్థాయి నుంచి పెంచుకోవాలని, ఇంటి పన్నుల విషయంలో సర్పంచులే బాధ్యతగా తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీని పెంచి, జిల్లాను ప్రథమ స్థానంలో నిలిచే విధంగా చూసుకోవాలన్నారు. కొన్ని గ్రామ పంచాయతీలకు బడ్జెట్‌ తక్కువగా ఉంటుందని, అలాంటి వాటికి కూడా త్వరలోనే ట్రాక్టర్లు ఇప్పించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ జుమిడి సౌందర్య, జడ్పీటీసీ సభ్యుడు వేముర్ల సంతోష్‌, వైస్‌ ఎంపీపీ గజ్జెల సత్యనారాయణ, తహసీల్దార్‌ రియాజ్‌ అలీ, ఎంపీడీవో సత్యనారాయణ సింగ్‌, సర్పంచులు అహల్యాదేవి, పోటు సుమలత, చెన్న సోమశేఖర్‌, వినోద, శ్రీనివాస్‌, శ్యాంరావు, తెరాస మండలాధ్యక్షుడు పోటు శ్రీధర్‌ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు సంగం శ్రీనివాస్‌, హరిత, నాయకులు పాల్గొన్నారు.