నాగర్‌కర్నూల్ : అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నెల 18న ఓ గర్భిణికి చేసిన కాన్పులో వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు తల తెగివచ్చిన సంఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. బాధ్యులపై సస్పెన్షను వేటు వేసిన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సమగ్ర విచారణకు ఉన్నతాధికారులతో కమిటీని నియమించిన విషయం విదితమే. కమిటీ శిశువు మృతికి కారణమైన పూర్వాపరాలు, అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను సేకరించి సమగ్ర నివేదికను వైద్య ఆరోగ్యశాఖకు అందజేసింది. ప్రాథమికంగా ఇందుకు బాధ్యులైనవారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో శిశువు మృతితో తనకు ఎలాంటి సంబంధం లేదని, కావాలనే తనను ఇందులో బలిపశువును చేశారంటూ సస్పెన్షనుకు గురైన ఓ వైద్యురాలు తన కుటుంబసభ్యులతో ఈ నెల 23న అచ్చంపేట ఆసుపత్రిలో మీడియా ముందుకొచ్చి చేసిన ఆరోపణ చర్చనీయాంశంగా మారింది. ఈమె జిల్లా కలెక్టరు శ్రీధర్, వైద్యఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అధికారులు ఈ కోణంలోనూ విచారణకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా అచ్చంపేట పోలీసులు ఈ కేసు విషయాన్ని మరింత లోతుగా విచారించనున్నారు.