కార్మికుడి వైద్య ఖర్చులు అందించి కుటుంబాన్ని ఆదుకోవాలి

నేరడిగొండ: ఓ సంస్థలో 10 సంవత్సరాలుగా సూపర్‌ వైజర్‌గా పని చేస్తున్న కార్మికుడికి వైద్య ఖర్చులు అందించి, కుటుంబాన్ని ఆదుకోవాలని వాంకిడి, కొర్టికల్‌, బుర్కపల్లి గ్రామాల ప్రజలు బాధితుడి బంధువులతో కలిసి కార్యాలయం ముందు భైఠాయించి నిరసన తెలిపారు. బంధువులు, స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. వాంకిడికి చెందిన మేకల రాజ్‌కుమార్‌ ఓ రోడ్డు నిర్మాణ సంస్థలో పదేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఏడాది కిందట ఆయన ఆరోగ్యం దెబ్బతినడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని పలు ఆసుపత్రుల్లో వైద్యం చేయించారు. వైద్యానికి రూ.5 లక్షల వరకు ఖర్చు కావడంతో ఇబ్బందిపడ్డామన్నారు. ఇటీవల వాంకిడిలోని ఇంటి నుంచి విధులకు బయలు దేరిన రాజ్‌కుమార్‌ కార్యాలయంలోనే కుప్పకూలారు. దీంతో సంస్థ వారు ఆయనను ఆసుపత్రిలో వదిలి రావడం సరైంది కాదన్నారు. వారు ఆసుపత్రిలో వదిలి వచ్చినప్పటి నుంచి వైద్యానికి మరో రూ.5 లక్షలు ఖర్చయ్యాయని దిగులు చెందారు. సంస్థలో పని చేస్తున్న కార్మికుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నా సంస్థ ఎలాంటి సాయం అందించకపోవడంపై మండి పడ్డారు. గతంలో వైద్య ఖర్చులు అందిస్తామని బిల్లులు తీసుకున్న సంస్థ ఇప్పటి వరకు ఒక్క రూపాయి చెల్లించ లేదని అసహనం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం బాధితుడి బంధువులు, గ్రామస్థులు పాషాతండా సమీపంలోని సంస్థ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. సంస్థ మేనేజర్‌ సూర్యనారాయణ, పీఆర్‌వో రవీందర్‌రెడ్డి కారును కార్యాలయ ఆవరణలోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. సంస్థ కార్యకలాపాలు సైతం నిలిపి వేశారు. ఇప్పటి వరకు రాజ్‌కుమార్‌ వైద్యానికి అయిన మొత్తం ఖర్చు రూ.10 లక్షలతో పాటు ఆయనకు మెరుగైన వైద్యాన్ని చేయించాలని డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబానికి ఆయన వేతనాన్ని యథావిధిగా చెల్లిస్తేనే తాము నిరసనను విరమించుకుంటామన్నారు. బంధువులు, గ్రామస్థులు హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయానికి వచ్చినట్లైతే సమస్య పరిష్కారానికి తమ వంతు సహకారాన్ని అందిస్తామని నిర్వాహకులు సూర్యనారాయణ, రవీందర్‌రెడ్డి, రాంమోహన్‌ తెలిపారు.