కడుపు కోతకు కటీఫ్‌!

రుగుతున్న సహజ ప్రసవాలు
-అనవసర ఆపరేషన్లకు అడ్డుకట్ట
-ఆర్నెల్లలో 60 నుంచి 30శాతానికి తగ్గిన సిజేరియన్లు


హైదరాబాద్‌: అనవసరమైన కడుపు కోతకు అడ్డుకట్ట పడుతున్నది.. సహజ ప్రసవాలకే ప్రాధాన్యమివ్వడంతో సిజేరియన్ల సంఖ్య భారీగా తగ్గుతున్నది. సహజ ప్రసవాలను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్ర యోగాత్మకంగా అమలుచేస్తున్న విధానాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ముఖ్యంగా సర్కా రు దవాఖానల్లో సిజేరియన్ల శాతం గణనీయంగా తగ్గుతున్నది. 2019 జనవరి నుంచి జూన్‌ మధ్యకాలంలో సరాసరి 63 శాతం ఉ న్న సిజేరియన్లు నవంబర్‌ చివరికి 30 శాతాని కి తగ్గించగలిగారు. ఓవైపు సర్కారు దవాఖానల్లో ప్రసవాలను ప్రోత్సహిస్తూనే సిజేరియన్ల శాతాన్ని పూర్తిస్థాయిలో తగ్గించేందుకు వైద్యశాఖ కృషి చేస్తున్నది. ఇందుకోసం ఈ ఏడాది ఏప్రిల్‌ నెల నుంచి రాష్ట్రంలోని 40 దవాఖానల్లో ప్రయోగాత్మక విధానాలు అవలంబిస్తున్నది. ఈ కారణంగానే నవంబర్‌ నాటికి సిజేరియన్లు 30 శాతానికి తీసుకురాగలిగారు. ఏడాది చివరి వరకు మరింత తగ్గించడమే లక్ష్యంగా వైద్య, ఆరోగ్యశాఖ కృషి చేస్తున్నది. తొలి కాన్పులో సహజ ప్రసవాలను పెంచాలని. చేపట్టిన ప్రత్యేక చర్యల కారణంగా సిజేరియన్లు గణనీయంగా తగ్గాయి.. జిల్లా దవాఖాలు, మాతాశిశు సంరక్షణ దవాఖానలు, ప్రాంతీయ దవాఖానలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రణాళిక అమలు చేస్తున్నది. దశలవారీగా ఈ విధానాన్ని రాష్ట్రంలోని అన్ని దవాఖానల్లో అమలుచేయనున్నారు.


 

 


సహజ ప్రసవాలు లక్ష్యంగా..


సురక్షిత, సహజ ప్రసవాలను పెంచాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా వైద్యశాఖ ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నది. గౌరవప్రదమైన ప్రసూతి సంరక్షణను ప్రోత్సహించేందుకు నర్సులకు ప్రత్యేకంగా మిడ్‌వైఫరీ శిక్షణ ఇవ్వడంతోపాటు, ప్రసవ అంచనా తేదీకి 15 రోజుల ముందు నుంచి సహజ ప్రసవాలపై గర్భిణులకు అవగాహన కల్పిస్తున్నారు. సహజ ప్రసవాల వల్ల కలిగే ఫలితాలను వివరిస్తూ.. సిజేరియన్‌ వైపు ఆలోచనరాకుండా చేస్తున్నారు. ప్రసవాల నిర్వహణలో ప్రామాణిక పద్ధతులు పాటించడంపై వైద్యులు, సిబ్బందికి అవగాహన పెంపొందిస్తున్నారు. అవసరమైన మౌలిక సదుపాయాలను, టెక్నాలజీని అందుబాటులో ఉంచుతున్నారు. నర్సింగ్‌ సిబ్బందితోపాటు ఆయుష్‌ విభాగం ద్వారా యోగా ట్రైనర్లను సహజ ప్రసవాలు జరిగేందుకు అనుసరించాల్సిన పద్ధతులను గర్భిణులకు వివరిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో నోడల్‌ అధికారులతో ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టి ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నారు.
Delhivery1