పేద పిల్లల కోసం వినికిడి పరికరాల బ్యాంకు ఈఎన్‌టీ వైద్యుల సంఘం దాతృత్వం

సుల్తాన్‌బజార్‌: పుట్టుకతోనే వినికిడి లోపంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు చెందిన చిన్నారుల కోసం ఈఎన్‌టీ వైద్యుల సంఘం దేశంలోనే ప్రప్రథమంగా 'హియరింగ్‌ ఎయిడ్‌ బ్యాంక్‌'ను అందుబాటులోకి తెచ్చింది. కోఠిలోని ప్రభుత్వ చెవి, ముక్కు, గొంతు (ఈఎన్‌టీ) ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని సంఘం అధ్యక్షులు డా.కె.సతీశ్‌, సంఘం ప్రతినిధులు, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.టి.శంకర్‌ తదితరులతో కలిసి గురువారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పేద, మధ్యతరగతి రోగులకు చేయూతనిచ్చేందుకు ఈఎన్‌టీ వైద్యుల సంఘం తనవంతు కృషి చేస్తోందని తెలిపారు. వినికిడి లోపంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు చెందిన చిన్నారులకు ఖరీదైన వినికిడి యంత్రాలను ఉచితంగా అందజేయడమే 'హియరింగ్‌ ఎయిడ్‌ బ్యాంక్‌' లక్ష్యమని పేర్కొన్నారు. పుట్టుకతోనే వినికిడి లోపంతో బాధ]పడుతున్న వారిని సకాలంలో గుర్తించి అర్హులైన వారికి కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీ చేయాల్సి ఉంటుందన్నారు.  ఖరీదైన ఈ చికిత్సను ఆరోగ్యశ్రీ ద్వారా చేస్తున్నప్పటికీ రూ.25 వేల నుంచి రూ.40 వేల విలువ చేసే వినికిడి యంత్రాన్ని మాత్రం బయట కొనుక్కోవాల్సి వస్తుండటంతో పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారికి భారంగా మారింది. కార్యక్రమంలో సంఘం హైదరాబాద్‌ అధ్యక్షుడు డా.ఆనంద్‌ ఆచార్య, సంఘం రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు డా.ఎల్‌.ఎస్‌.రెడ్డి, ఈఎన్‌టీ వైద్య నిపుణులు డా.శోభన్‌బాబు, డా.సంపత్‌కుమార్‌సింగ్‌, డా.సాయికుమార్‌, డా.డి.ద్వారకానాథ్‌రెడ్డి, డా.వెంకట్‌రాంరెడ్డి, డా.ఓరుగల్లు రవిశంకర్‌ తదితరులు పాల్గొని సంఘం ప్రతినిధులను అభినందించారు.