ఆహారం కల్తీ.. ఆరోగ్యానికి సుస్తీ!

జారోగ్యంతో పలు హోటళ్ల నిర్వాహకుల చెలగాటం


నగరంలోని ఒక హోటలులో రంగు కలిపిన టమోటా సాస్‌


అనంతపురం : ఏది కొనాలన్నా నకిలీ.. ఏది తినాలన్నా కల్తీ.. ప్రముఖ హోటళ్లలోనూ అపరిశుభ్ర వాతావరణంలో వంటకాలు వండుతున్నారు. ఆపై మోతాదుకు మించి నాసి రకం రంగులు కలుపుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా శీతల పెట్టెల్లో చికెన్‌, మటన్‌ నిల్వ చేస్తున్నారు. వాటికి బూజు పట్టినా ఏమాత్రం పట్టించుకోవటం లేదు. కొన్ని హోటళ్లలో బాత్‌రూం, వంట గది ఒకేచోట ఉంటున్నాయి. గచ్చు ఎగుడు దిగుడుగా ఉండటంతో నీళ్లు నిలిచిపోయి వాసన, దోమలతో అపరిశుభ్ర వాతావరణం తాండవిస్తోంది. రుచికరమైన వంటల కోసం మోతాదుకు మించి అజినమోటో (టేస్టింగ్‌ సాల్ట్‌) కలుపుతున్నారు. నిల్వ చేసిన మాంసాన్ని వండుతున్నారు. సగం ఉడికించిన చికెన్‌, మటన్‌కు రంగులద్ది ఉడికిన పదార్థాలుగా భ్రమింపచేస్తున్నారు. ఇలా కల్తీ, నాసిరకం వంటకాలు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నగరంలో రెండ్రోజుల క్రితం కొన్ని ప్రముఖ హోటళ్లలో ఆహార పరిరక్షణ శాఖ అధికారులు జరిపిన ఆకస్మిక తనిఖీలో ఆహార నాణ్యతలో డొల్లతనం బయటపడింది. రుచి, శుచీ లేని ఆహార పదార్థాలు తిన్న ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. మోతాదుకు మించి రంగులు వాడిన వంటకాలు తింటే కడుపునొప్పి, అజీర్ణం, వాంతులు విరేచనాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. కల్తీలు, నాసిరకం ఆహార పదార్థాలు విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న వ్యాపారుల ఆట కట్టించాల్సిన అవసరం ఉంది.


అమలవుతున్నది ఇలా..


కొన్ని హోటళ్లలో వంటగది, బాత్‌రూం ఒకే గదిలో ఉన్నాయి. వంటగది గచ్చు ఎగుడు దిగుడుగా ఉండటంతో వండిన నీరంతా నిల్వ ఉంటున్నాయి. అధిక మోతాదులో రంగులు కలుపుతున్నారు. టేస్టింగ్‌ సాల్ట్‌ను ఎక్కువ మోతాదులో కలుపుతున్నారు. చికెన్‌, మటన్‌ పదార్థాలను శీతల పెట్టెలో సాధారణ ఉష్ణోగ్రత కలిగిన వాటిలో నిల్వ చేస్తున్నారు. ఆపై మోతాదుకు మించి రంగు కలుపుతున్నారు. ఉడికీ ఉడకని వంటకాలు, వంటకు వాడిన నూనెను మళ్లీ వాడుతున్నారు. టమోటా సాస్‌ తయారీ కోసం టమోటాలు వాడకుండా రంగులు వాడుతున్నారు.


నిబంధనలు ఇవీ..


●హోటళ్లలో వంట గదులు శుభ్రంగా ఉండాలి.


బూజు, దుమ్ము చేరకుండా చూడాలి.


వంటగది, బాత్రూం విడిగా ఉండాలి.


వంటగదిలో నీరు నిలవకుండా గచ్చు సమతులంగా ఉండాలి.


●రుచి కోసం కలుపుతున్న టేస్టింగ్‌ సాల్ట్‌ ఒక కిలో బియ్యానికి 10 పీపీఎం పరిమాణంలో వాడాలి. ●


ఐఎస్‌ఐ ముద్ర కలిగిన రంగులను పరిమితంగా వాడాలి. ●


టమోటా సాస్‌ తయారీకి టమోటాలు వాడాలి. రంగులు వాడరాదు. ●


చికెన్‌, మటన్‌ పదార్థాలను మైనస్‌ 20 సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత ఉన్న శీతల పెట్టెలో నిల్వ చేయాలి. ఆపై బాగా ఉడికించిన వాటినే విక్రయించాలి.


ఆకస్మిక తనిఖీలు ముమ్మరం


నగరంలో కొన్ని ప్రముఖ హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు చేసి నిబంధనలకు విరుద్ధంగా వండిన వంటకాలను సేకరించి నాణ్యత పరీక్షలకు పంపించాం. ఒకే గదిలో వంటగది, బాత్‌రూం నిర్మించిన హోటల్‌ నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశాం. అనుమతి లేని రంగులు మోతాదుకు మించి వినియోగిస్తుండటంతో.. ఇవి తిన్న ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. నగరంలోని కొన్ని హోటళ్లలో జరిపిన ఆకస్మిక తనిఖీలో నిర్వాహకులు నిబంధనలు పాటించని తీరును గుర్తించాం. టమోటా సాస్‌, శీతల పెట్టెలో నిల్వ చేసిన చికెన్‌, మటన్‌ వంటకాలను నాణ్యత పరీక్షలకు హైదరాబాద్‌లోని ప్రయోగశాలకు పంపించాం. నివేదిక అందిన తర్వాత చర్యలు తీసుకుంటాం. సిబ్బంది కొరతతో మరింత విరివిగా తనిఖీలు చేయలేకపోయాం. - శ్రీనివాసరెడ్డి, అసిస్టెంట్‌ ఫుడ్‌కంట్రోలరు.