వ్యాధి కారకాలను 20 శాతం నిరోధించవచ్చని యూఎన్సీ పరిశోధనల్లో వెల్లడి
- మెనోపాజ్ దశలో ఉన్న మహిళలు నిత్యం వాడాలి
- ఎంఎన్‌జే హాస్పిటల్ వైద్యుడు సాయిరాం సూచన
హైదరాబాద్ : ఆస్పిరిన్ మాత్రలతో రొమ్ము క్యాన్సర్‌కు చెక్ పెట్టవచ్చంటున్నారు వైద్యనిపుణులు. రొమ్ము క్యాన్సర్ కారకాలను ఆస్పిరిన్ నివారిస్తుందని ఇటీవల పరిశోధనల్లో వెల్లడైనట్టు యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా (యూఎన్సీ) తన క్యాన్సర్ జర్నల్‌లో పేర్కొన్నది. ఆస్పిరిన్ మాత్రలతో క్యాన్సర్ కారకాలను 20 శాతం మేరకు అడ్డుకోవచ్చని, మెనోపాజ్ దశలో ఉన్న మహిళలు ఈ మాత్రలను వాడడం ఉత్తమమని హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్ క్లినికల్ ఆంకాలజిస్టు డాక్టర్ సాయిరాం స్పష్టంచేశారు. సాధారణంగా ఆస్పిరిన్ మాత్రలను దీర్ఘకాలిక నొప్పుల నివారణతోపాటు రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు, గుండెపోటును నిరోధించేందుకు ఉపయోగిస్తారు. ఇవే మాత్రలు రొమ్ము క్యాన్సర్‌కు దారితీసే మిథలైజేషన్ ప్రక్రియను కూడా అడ్డుకొంటుందని యూఎన్సీ క్యాన్సర్ పరిశోధకుడు డాక్టర్ టెన్ టెన్ వాంగ్ తను రాసిన జర్నల్స్‌లో పేర్కొన్నట్టు డాక్టర్ సాయిరాం తెలిపారు. మహిళల్లో వంవపారంపర్యంగా రొమ్ము క్యాన్సర్ రావడానికి దోహదపడే బ్రాకా-1, బ్రాకా-2 కారకాలతోపాటు అసహజరీతిలో కణవిభజనకు దారితీసే మిథలైజేషన్ ప్రక్రియను ఆస్పిరిన్ మాత్రలు అడ్డుకుంటాయని ఆయన వివరించారు.
రోజుకొకటి వాడాలి
అతితక్కువ ధరకు (కేవలం రూపాయికే) లభించే ఆస్పిరిన్ మాత్రలను మెనోపాజ్ దశకు చేరిన మహిళలు ముందుజాగ్రత్త చర్యగా రోజుకు ఒకటి చొప్పున వాడితే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలను అడ్డుకోవచ్చు. అసిడిటీ సమస్య లేనివారు రోజూ భోజనం తర్వాత ఈ మాత్రను తీసుకోవాలి.
- డాక్టర్ సాయిరాం, ఎంఎన్‌జే హాస్పిటల్