జిల్లా వైద్యాధికారిగా మాలతి

ఖమ్మం : జిల్లా వైద్యాధికారిగా డాక్టర్‌ మాలతి నియమితులయ్యారు. అనూహ్యంగా బదిలీ అయిన డీఎంహెచ్‌వో కళావతిబాయి స్థానంలో మాలతి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఖమ్మం వైద్య డివిజన్‌ ఉప వైద్యాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మాలతిని జిల్లా వైద్యాధికారిగా(పుల్‌ ఎడిషన్‌ ఛార్జీ) నియమిస్తూ వైద్యశాఖ మంగళవారం ఆదేశాలు చేసింది.నూతన జిల్లా వైద్యాధికారిగా డాక్టర్‌ మాలతి బాధ్యతల స్వీకారం సందర్భంగా కొంత ఉత్కంఠ నెలకొంది. మంగళవారం మధ్యాహ్నం కళావతిబాయి బదిలీ ఉత్తర్వులు అందాయి. అప్పటి వరకు డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఉన్న కళావతిబాయి భోజనానికి ప్రభుత్వ వాహనంలో ఇంటికి వెళ్లి, సదరు వాహనాన్ని కార్యాలయానికి పంపారు. ఆమె మాత్రం రాలేదు. బాధ్యతలు స్వీకరించేందుకు డీఎంహెచ్‌వో కార్యాలయానికి వచ్చిన డాక్టర్‌ మాలతి మధ్యాహ్నం నుంచి సాయంత్రం 5.20గంటల వరకు నిరీక్షించారు.గంటల తరబడి వేచి చూసిన మాలతి .. డీఎంహెచ్‌వో కుర్చీలో కూర్చోలేదు. చివరకు కార్యాలయం ఉద్యోగి అనిల్‌ డాక్టర్‌ మాలతితో సీటీసీపై సంతకాలు తీసుకున్న తర్వాత కలెక్టర్‌ కర్ణన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పరిస్థితిని వివరించారు. అనంతరం కలెక్టర్‌ సూచనతో తిరిగి డీఎంహెచ్‌వో కార్యాలయానికి వచ్చి జిల్లా వైద్యాధికారి కుర్చీలో కూర్చున్నారు. దీంతో ఉత్కంఠకు తెరపడింది. ప్రోగ్రామ్‌ ఆఫీసర్లు డాక్టర్‌ సైదులు, ప్రభుత్వ వైద్యాధికారుల సంఘం నాయకులు నాగేశ్వరరావు, రాంబాబు, శ్రీకాంత్‌, ప్రమోద్‌, రాధిక, సురేశ్‌, రమేశ్‌, శంకర్‌కుమార్‌, నవ్యకాంత్‌, శంకర్‌కుమార్‌, వెంకటేష్‌, దర్మేంధ్ర, హనుమంతరావు, బాలకృష్ణ తదితరులు నూతన డీఎంహెచ్‌వోకు శుభాకాంక్షలు తెలిపారు.