ఒంగోలు : ఒంగోలు సుందరయ్య భవన్ రోడ్డులోని శ్రీనివాస హోల్‌సేల్ సర్జికల్ దుకాణంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 2.30 గంటల సమయంలో దుకాణం నుంచి పొగలు రావడాన్ని స్థానికులు గమనించారు. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. తెల్లవారుజాము సమయానికి మంటలను అదుపు చేశారు. అప్పటికే దుకాణంలోని విలువైన సర్జికల్ పరికరాలు, మందులు అగ్నికి ఆహుతయ్యాయి. అర్ధరాత్రి సమయంలో ప్రమాదం చోటుచేసుకోవడం., విషయాన్ని ఆలస్యంగా గుర్తించటంతో విలువైన పరికరాలు, మందుల్ని బయటికి తీసుకురాలేకపోయారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.50 లక్షల వరకు నష్టం వాటిల్లినట్టు దుకాణ నిర్వాహకుడు రాజశేఖర్‌రెడ్డి అగ్నిమాపక శాఖాధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్యుత్తు షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుని ఉంటుందని అనుమానిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఒకటో పట్టణ పోలీసులతో పాటు విద్యుత్తు శాఖాధికారులకు లేఖలు రాసినట్టు అగ్నిమాపక కేంద్రం అధికారి వెంకటరెడ్డి చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.